కరోనాను కట్టడి చేయగలిగాం

14 Aug, 2020 20:06 IST|Sakshi

జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

సాక్షి, న్యూఢిల్లీ : 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారితో ప్రపంచమంతా పోరాడుతోందని, ఈ వ్యాధితో ముందుండి పోరాడుతున్న యోధులకు దేశం రుణపడిఉందని అన్నారు. కోవిడ్‌-19తో ప్రజల జీవనస్ధితిగతులు మారిపోయాయని చెప్పారు. ఈ విపత్కర పరిస్ధితుల్లో కేంద్రం పలు పధకాల ద్వారా ప్రజలకు సాయం చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందించి స్ధానిక పరిస్ధితులకు అనుగుణంగా చర్యలు చేపట్టడంతో కరోనా ప్రభావాన్ని కొంతమేర కట్టడి చేయగలిగామని చెప్పారు. వేగవంతంగా మనం తీసుకున్న చర్యలతో ఎందరో ప్రాణాలు నిలబెట్టామని, దీనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని గుర్తుచేశారు. చదవండి : అగ్నిప్రమాదం కలచివేసింది

వందేభారత్‌ మిషన్‌ ద్వారా విదేశాల్లో చిక్కుకున్న పది లక్షల మంది స్వదేశానికి చేరకున్నారని తెలిపారు. ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మెరుగైన మార్పులకు శ్రీకారం చుడుతోందన్నారు.ఇక గల్వాన్‌లో అమరులైన సైనికులకు జాతి సెల్యూట్‌ చేస్తోందని చెప్పారు. ప్రత్యర్ధుల దూకుడుకు దీటుగా బదులిస్తామని గల్వాన్‌లో మన సైనికుల ధైర్యసాహసాలు సుస్పష్టం చేశాయని అన్నారు. ప్రపంచమంతా మహమ్మారితో ఐక్యంగా పోరాడుతున్న వేళ పొరుగు దేశం తన విస్తరణ కార్యకలాపాలను చేపట్టేందుకు దుస్సాహసానికి ఒడిగట్టిందని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ మనం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామని చెప్పారు. దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

>
మరిన్ని వార్తలు