రాష్ట్రపతికి విజయవంతంగా బైపాస్‌ సర్జరీ

30 Mar, 2021 18:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ఛాతీలో నొప్పితో అనారోగ్యానికి గురయిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇటీవల ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం మంగళవారం ఆయనకు బైపాస్‌ సర్జరీ విజయవంతంగా చేశారు. ఈ విషయాన్ని ఎయిమ్స్‌ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రపతి ఆరోగ్యం కుదుటగా ఉందని.. కోలుకుంటున్నారని వెల్లడించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎయిమ్స్‌ వైద్యులను ఆయన అభినందించారు.

ఈనెల 27వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఛాతీ నొప్పితో సైనిక (ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌) ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆ ఆస్పత్రి వర్గాలు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లాలని సూచించాయి. సాధారణ వైద్య పరీక్షలు రావడంతో రామ్‌నాథ్‌ ‌కోవింద్‌కు బైపాస్‌ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు బైపాస్‌ సర్జరీ విజయవంతంగా ముగించారు. దీనిపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌​ సింగ్‌ ట్వీట్‌ చేశారు. ‘ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రాష్ట్రపతికి విజయవంతంగా బైపాస్‌ సర్జరీ జరిగింది. విజయవంతంగా సర్జరీ చేసిన వైద్యులను అభినందిస్తున్నా. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్‌ డైరెక్టర్‌తో మాట్లాడి తెలుసుకున్నా. రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు