కలలో కూడా అనుకోలేదు: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

28 Jun, 2021 04:35 IST|Sakshi
పుట్టినగడ్డకు నమస్కారం చేస్తున్న రాష్ట్రపతి కోవింద్‌

లక్నో/కాన్పూర్‌: గ్రామీణ నేపథ్యం ఉన్న తనలాంటి సామాన్యుడు దేశ అత్యున్నత పదవిని పొందగలగడని కలలో కూడా ఊహించలేదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌దేహత్‌ జిల్లాలోని తను పుట్టిన ఊరు పారౌంఖ్‌ పౌరులనుద్దేశించి ఆదివారం కోవింద్‌ ప్రసంగించారు. స్వస్థలాన్ని  చూడగానే భావోద్వేగానికి గురైన రాష్ట్రపతి.. మోకాళ్లపై వంగి అక్కడి నేలకు నమస్కరించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కోవింద్‌ తన సొంతూరికి రావడం ఇదే ప్రథమం. 

‘నాలాంటి సామాన్య పల్లెటూరి పిల్లవాడు దేశంలోనే అత్యున్నత పదవిని అధిరోహించగలడని కలలో కూడా అనుకోలేదు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ దాన్ని నిజం చేసింది. నేను ఏ స్థాయికి చేరుకున్నా, ఆ ఘనత ఈ నేలకు, ఈ మట్టికి, ఇక్కడి ప్రజలకే చెందుతుంది’ అని కోవింద్‌ ఉద్వేగపూరితంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్, ఇతర స్వాతంత్య్ర సమర యోధులకు కోవింద్‌ నివాళులర్పించారు. అక్కడి మిలన్‌ కేంద్రం, వీరాంగన ఝల్కారీ బాయి ఇంటర్‌ కాలేజ్‌లను సందర్శించారు.

‘నా కుటుంబ విలువల ప్రకారం, కులాలకతీతంగా గ్రామంలోని అత్యంత వృద్ధురాలిని అమ్మగా, అత్యంత వృద్ధుడిని తండ్రిగా భావిస్తాం. ఆ సంప్రదాయం  ఇంకా కొనసాగుతున్నందుకు సంతోషంగా ఉంది’ అన్నారు.  తన గ్రామం మట్టివాసన, ఇక్కడి జ్ఞాపకాలు తన హృదయంలో పదిలంగా ఉన్నాయన్నారు. ‘పారౌంఖ్‌ అంటే నా దృష్టిలో కేవలం ఒక గ్రామం కాదు. ఇది నా మాతృభూమి. దేశ సేవకు  స్ఫూర్తినిచ్చిన నేల. ఆ స్ఫూర్తితోనే మొదట హైకోర్టుకు, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు.. ఆ తరువాత రాజ్యసభకు, ఆపై రాజ్‌భవన్‌కు.. ఇప్పుడు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నా’నన్నారు.  ఉత్తరప్రదేశ్‌ నుంచి చాలా మంది ప్రధానమంత్రులయ్యారని, రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తిని మాత్రం తానేనని కోవింద్‌ వెల్లడించారు. అందరు కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవాలని గ్రామస్తులను కోరారు. గ్రామస్తులు రాష్ట్రపతిభవన్‌ను చూసేందుకు త్వరలో ఏర్పాట్లు చేస్తానన్నారు.  స్కూల్‌లో తన క్లాస్‌మేట్స్‌ అయిన జస్వంత్‌ సింగ్, చంద్రభాన్‌ సింగ్, దశరథ్‌ సింగ్‌లను కలుసుకోలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు