Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నిక నేడే

18 Jul, 2022 04:59 IST|Sakshi

ఓటేయనున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు

ఢిల్లీతో పాటు రాష్ట్రాల్లోనూ ఓటింగ్‌

ముర్ము ఎన్నిక లాంఛనమే

న్యూఢిల్లీ: దేశ 15వ రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. 4,800 మందికి పైగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం ఓటు వేయనున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌లో, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదింటి దాకా పోలింగ్‌ జరుగుతుంది. బ్యాలెట్‌ బాక్సులను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్ర్రాలకు తరలించడంతో పాటు అన్ని ఏర్పాట్లూ చేసింది.

21న పార్లమెంట్‌హౌస్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు. ఎన్డీఏ తరఫున గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల నుంచి యశ్వంత్‌ సిన్హా బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏకంగా 60 శాతానికి పైగా ఓట్లు కూడగట్టుకున్న ముర్ము మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేలా కన్పిస్తున్నారు. మొత్తం 10,86,431 ఓట్లలో ఆమెకు 6.67 లక్షల పై చిలుకు ఓట్లు ఇప్పటికే ఖాయమయ్యాయి.

దాంతో సునాయాసంగా విజయం సాధించి రాష్ట్రపతి పదవికి ఎన్నికైన తొలి గిరిజన మహిళగా ముర్ము రికార్డు సృష్టించనున్నారు. అంతేగాక ప్రతిభా పాటిల్‌ తర్వాత ఈ అత్యున్నత పదవి చేపట్టనున్న రెండో మహిళ అవుతారు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజీలో ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ఉంటారు. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. నామినేటెడ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులకు ఓటు హక్కుండదు.

సీక్రెట్‌ బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరుగుతుంది. ఫలానా అభ్యర్థికే ఓటేయాలంటూ పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేయలేవు. కాబట్టి క్రాస్‌ ఓటింగ్‌కు అవకాశముంటుంది. జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ లేనందున ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 నుంచి 700కు తగ్గింది. ఇక ఎమ్మెల్యేల ఓటు విలువలో 208తో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. 176తో జార్ఖండ్, తమిళనాడు రెండోస్థానంలో, 175తో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నాయి. సిక్కిం ఎమ్మెల్యేల ఓటు విలువ అతి తక్కువగా 7గా ఉంది.  
 

మరిన్ని వార్తలు