Presidential Election 2022: రాష్ట్రపతి అభ్యర్థిపై.. మమతా వర్సెస్‌ బీజేపీ!

16 Jun, 2022 07:44 IST|Sakshi

17 విపక్షాల కీలక భేటీ

పోటీకి వవార్‌ నిరాకరణ, తెరపైకి 

గోపాలకృష్ణ గాంధీ, ఫరూక్‌ పేర్లు

మమత, పవార్‌ సహా పలువురు విపక్ష నేతలకు రాజ్‌నాథ్‌ ఫోన్లు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ నిరాకరించారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశం ఇందుకు వేదికైంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, శివసేన, వామపక్షాలతో పాటు 17 విపక్షాలు భేటీలో పాల్గొన్నాయి. టీఆర్‌ఎస్, బిజూ జనతాదళ్, ఆప్, అకాలీదళ్, మజ్లిస్‌ దూరంగా ఉన్నాయి. మధ్యాహ్నం 3 నుంచి 5 దాకా రెండు గంటల పాటు సమావేశం జరిగింది. ‘‘స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ దేశ సామాజిక వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి మోదీ సర్కారు మరింత హాని చేయకుండా అడ్డుకునేందుకు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలి’’ అంటూ తీర్మానాన్ని ఆమోదించింది.

అనంతరం విపక్షాల తరఫున పవార్‌ అభ్యర్థిత్వాన్ని పార్టీలన్నీ ముక్త కంఠంతో సమర్థించాయి. అయితే పోటీకి పవార్‌ సున్నితంగా నిరాకరించారు. భేటీ అనంతరం ఈ మేరకు ట్వీట్‌ చేశారు. తనపై నమ్మకముంచినందుకు పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. పవార్‌ అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం వ్యక్తమైందని మమత మీడియాకు తెలిపారు. వ్యవస్థలన్నింటినీ పథకం ప్రకారం నాశనం చేస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు అందరూ ఒక్కతాటిపై రావాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్‌ దృష్టిలో ఏ అభ్యర్థీ లేరని ఖర్గే చెప్పారు. అన్ని పార్టీలతో సంప్రదించి ఏకాభిప్రాయం సాధిస్తామన్నారు. ‘‘దేశ వైవిధ్యాన్ని కాపాడటంతో పాటు విద్వేష, విభజన శక్తులను ఎదిరించగల వ్యక్తే రాష్ట్రపతి వంటి పదవిని అధిష్టించాలి’’ అని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీయేతర పార్టీలతో సంప్రదింపులు జరిపే బాధ్యతను పవార్, మమత, కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గేలకు అప్పగించినట్టు డీఎంకే నేత టీఆర్‌ బాలు చెప్పారు.

పోటీకి పవారే సరైన వ్యక్తని, ఆయన్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా అన్నారు. పవార్‌ నిరాకరణ అనంతరం ఎన్సీపీ నేత ఫరూక్‌ అబ్దుల్లాతో పాటు గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేర్లను కూడా మమత సూచించినట్టు ఆరెస్పీ నేత ప్రేమ్‌చంద్రన్‌ తెలిపారు. గోపాలకృష్ణ గాంధీ 2017లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. కానీ అదే సమయంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఓటేసిన జేడీ(యూ), బీజేడీ మద్దతు పొందగలిగారు. విపక్షాల భేటీలో ప్రఫుల్‌ పటేల్‌ (ఎన్సీపీ), ఖర్గే, జైరాం రమేశ్, రణ్‌దీప్‌ సుర్జేవాలా (కాంగ్రెస్‌), దేవెగౌడ, కుమార్‌స్వామి (జేడీఎస్‌), అఖిలేశ్‌ యాదవ్‌ (ఎస్పీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), ఒమర్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌) పాల్గొన్నారు. జూన్‌ 20, లేదా 21న పవార్‌ సారథ్యంలో మళ్లీ భేటీ కావాలని నిర్ణయించారు.

బీజేపీలో జోష్‌ 
మమత భేటీకి టీఆర్‌ఎస్, బీజేడీ, ఆప్‌ వంటి కీలక ప్రాంతీయ పార్టీలు దూరంగా ఉండటం బీజేపీలో ఉత్సాహం నింపింది. బీజేడీ ఎప్పుడూ విపక్ష శిబిరానికి దూరం పాటిస్తూ వస్తోంది. పలు అంశాలపై ఎన్డీఏకే మద్దతివ్వడం తెలిసిందే. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజీలో ఎన్డీయేకు 48 శాతానికి పైగా ఓట్లున్నాయి. బీజేడీ తదితరుల మద్దతుతో తమ గెలుపు సునాయాసమేనని బీజేపీ భావిస్తోంది. విపక్ష భేటీలో నేతలంతా తమదే పై చేయి అని నిరూపించుకోజూశారని పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు. ఈ భేటీలతో దేశానికి ఒరిగేదేమీ లేదంటూ పెదవి విరిచారు.

మీ చాయిస్‌ చెప్పండి: బీజేపీ
మరోవైపు రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసే ప్రయత్నాలను అధికార బీజేపీ ముమ్మరం చేసింది. ఈ బాధ్యతలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలపై పెట్టిన విషయం తెలిసిందే. బుధవారం రాజ్‌నాథ్‌ పలు విపక్షాల నేతలతో ఫోన్లో వరుస సంప్రదింపులు జరిపారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక ప్రయత్నాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న మమతకు కూడా ఆయన ఫోన్‌ చేయడం విశేషం. ఆమెతో పాటు విపక్షాల భేటీలో పాల్గొన్న పవార్, కాంగ్రెస్‌ నేత ఖర్గే, ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌లతోనూ ఆయన మాట్లాడారు.

అలాగే బీజేడీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, జేడీ(యూ) చీఫ్, బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులతోనూ రాజ్‌నాథ్‌ చర్చలు జరిపినట్టు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరైతే వారికి అంగీకారమో తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. ఎన్డీఏ అభ్యర్థిగా ఎవరిని అనుకుంటున్నారని నేతలు రాజ్‌నాథ్‌ను ప్రశ్నించినట్టు చెబుతున్నారు. నడ్డా కూడా ఫరూక్‌ అబ్దుల్లాతో ఫోన్లో చర్చలు జరిపారు. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ), నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌), ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ((ఏజేఎస్‌యూ), స్వతంత్ర ఎంపీలతోనూ మాట్లాడారు.

నోటిఫికేషన్‌ విడుదల 
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు బుధవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. దాంతోపాటే నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. జూన్‌ 29 దాకా నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఉపసంహరణకు జూలై 2 తుది గడువు. జూలై 18న ఎన్నిక జరుగుతుంది. జూలై 21న ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. తొలిరోజు 11 నామినేషన్లు దాఖలవగా ఒకటి తిరస్కరణకు గురైంది.

చదవండి: విపక్ష నేతలకు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్‌.. మద్ధతు ఇవ్వాలని విజ్ఞప్తి

మరిన్ని వార్తలు