Draupadi Murmu: నిరాడంబరతే ఆభరణం

22 Jul, 2022 03:33 IST|Sakshi

పుట్టింది వెనకబడ్డ ఒడిశా రాష్ట్రంలో. అందులోనూ, దేశంలోకెల్లా అత్యంత వెనకబడ్డ జిల్లాలో. ఎలాంటి సౌకర్యాలకూ నోచని అత్యంత కుగ్రామంలో. అది కూడా అత్యంత వెనకబడిన సంతాల్‌ గిరిజన కుటుంబంలో. అలా అత్యంత అట్టడుగు స్థాయి నుంచి మొదలైన ద్రౌపదీ ముర్ము జీవన ప్రస్థానం అత్యున్నతమైన రాష్ట్రపతి పీఠం దాకా సాగిన తీరు ఆద్యంతం ఆసక్తికరం.

సౌకర్యాల లేమిని అధిగమించడంలో ఎంతటి అసమాన పట్టుదల కనబరిచారో వ్యక్తిగత జీవితంలో ఎదురైన పెను విషాదాలను తట్టుకోవడంలోనూ అంతకు మించిన మనో నిబ్బరం చూపారామె. అన్నింటికీ మించి ఎదిగిన కొద్దీ అంతకంతా ఒదిగుతూ వచ్చారు. వినమ్రతకు పర్యాయ పదంలా నిలిచారు. నెలకు కేవలం 10 రూపాయలతో కాలేజీ జీవితం గడుపుకున్నప్పుడు ఎంత నిరాడంబరంగా ఉన్నారో, 2021లో జార్ఖండ్‌ గవర్నర్‌గా పదవీ విరమణ చేశాక కూడా అంతే నిరాడంబరత ప్రదర్శించారు.

స్వస్థలానికి తిరిగొచ్చి భర్త కట్టించిన సాదాసీదా ఇంట్లోనే మామూలు జీవితం గడిపారు. అంతటి నిగర్వి ముర్ము. జార్ఖండ్‌ గవర్నర్‌గా కూడా వివాదరహితంగా బాధ్యతలను నిర్వర్తించిన సౌమ్యురాలు. అధికార కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన ఆమెకు విపక్షాల ఓట్లు కూడా గణనీయంగా పడేందుకు గిరిజన నేపథ్యంతో పాటు ఈ ప్రవర్తన కూడా కారణమైంది.

ద్రౌపదీ ముర్ము ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా ఉపర్‌బేడ గ్రామంలో 1958 జూన్‌ 20వ తేదీన జన్మించారు. ఆమె తండ్రి బిరంచి నారాయణ్‌ తుడు. పట్టుదలతో స్కూలు చదువు, తర్వాత భువనేశ్వర్‌లో కాలేజీ చదువు పూర్తి చేశారు. తర్వాత జూనియర్‌ అసిస్టెంట్‌గా జీవితం మొదలు పెట్టారు. స్కూల్‌ టీచర్‌గా, రాయ్‌రంగాపూర్‌లోని శ్రీ అరబిందో ఇంటెగ్రల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేశారు. 1997లో బీజేపీలో చేరారు. రాయ్‌రంగాపూర్‌ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2000లో చైర్‌పర్సన్‌ అయ్యారు. బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, తర్వాత బీజేపీ–బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. 2015లో జార్ఖండ్‌ తొలి మహిళా గవర్నర్‌ అయ్యారు.

పేరు: ద్రౌపది ముర్ము
పుట్టిన తేదీ: జూన్‌ 20, 1958
పుట్టిన ఊరు: ఉపర్‌బేడ, మయూర్‌భంజ్, ఒడిశా
వయస్సు: 64 ఏళ్లు
తండ్రి: బిరంచి నారాయణ్‌ తుడు
రాజకీయ పార్టీ: బీజేపీ
చదువు: రమాదేవి విమెన్స్‌ యూనివర్సిటీ నుంచి బీఏ
చేపట్టిన పదవులు: జార్ఖండ్‌ గవర్నర్, ఒడిశా రాష్ట్ర మత్స్య, పశుసంవర్థక, వాణిజ్యం, రవాణా శాఖలు
సంతానం: ఇతిశ్రీ ముర్ము (బ్యాంకు ఉద్యోగి)
భర్త: శ్యాం చరణ్‌ ముర్ము (2014లో మృతి)  

తీరని విషాదాలు...
ముర్ము వ్యక్తిగత జీవితంలో తీరని విషాదాలున్నాయి. బ్యాంక్‌ ఉద్యోగి అయిన శ్యామ్‌ చరణ్‌ ముర్మును ఆమె పెళ్లాడారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 2009–15 మధ్య కేవలం ఆరేళ్ల వ్యవధిలో భర్తతో పాటు ఇద్దరు కొడుకులను, తల్లిని, సోదరుడినీ కోల్పోయారు. ఈ విషాదం తనను ఆధ్యాత్మిక బాట పట్టించిందని 2016లో దూరదర్శన్‌ ఇంటర్వ్యూలో గుర్తుకు తెచ్చుకున్నారు. ‘‘అప్పట్లో పూర్తిగా కుంగిపోయి తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అప్పుడే బ్రహ్మకుమారీల ఆశ్రమాన్ని సందర్శించాను. నా కుమార్తె కోసం జీవించాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పారు.

ముర్ము చరిత్ర సృష్టించారు
అత్యున్నత పదవికి ఎన్నికైన గిరిజన బిడ్డగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. ఆమె గొప్ప రాష్ట్రపతిగా పేరు సంపాదిస్తారు. ఆమె పేదలు, అణగారిన వర్గాల ఆశారేఖగా ఉద్భవించారు. 130 కోట్ల మంది దేశ ప్రజలు ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’జరుపుకుంటున్న వేళ గిరిజన బిడ్డ రాష్ట్రపతి పదవికి ఎన్నిక కావడం గొప్ప విషయం. మారుమూల కుగ్రామంలో జన్మించిన ముర్ము సాధించిన విజయాలు దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకం. ముర్ముకు మద్దతుగా నిలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు మోదీ కృతజ్ఞతలు. – ప్రధాని నరేంద్ర మోదీ  

నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు నా అభినందనలు, శుభాకాంక్షలు.  
– రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

ప్రజా జీవితంలో ద్రౌపది ముర్ము సంపాదించిన అనుభవం, అందించిన నిస్వార్థ సేవలు, ప్రజా సమస్యలకు ఆమెకున్న అవగాహన దేశానికి ఉపయోగడపతాయి. ద్రౌపది ముర్ముకు మనస్ఫూర్తి అభినందనలు.
– ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

తదుపరి రాష్ట్రపతిగా ముర్ము ఎన్నిక దేశానికి గర్వకారణం. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ముర్ముకు అభినందనలు.        
 –హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా

ద్రౌపది ముర్ముకు అభినందనలు. దేశాధినేతగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను ఆమె కాపాడుతారన్న నమ్మకం ఉంది.                                    
– బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

నా తండ్రి పీఏ సంగ్మా ఇప్పుడు జీవించి ఉంటే ద్రౌపది ముర్ము విజయాన్ని చూసి ఎంతగానో సంతోషించేవారు. ముర్ముకు నా అభినందనలు.                       
–మేఘాలయ సీఎం కాన్రాడ్‌ సంగ్మా

రాష్ట్రపతి ఎన్నికలో నెగ్గిన ముర్ముకు నా అభినందలు. భయం, పక్షపాతానికి తావులేకుండా రాజ్యాంగ పరిరక్షణకు ఆమె కృషి చేస్తారని ఆశిస్తున్నా.                    
– యశ్వంత్‌  సిన్హా

15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు అభినందనలు. భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా.                                      
–రాహుల్‌ గాంధీ

మరిన్ని వార్తలు