వారిది ఓటు బ్యాంకు బడ్జెట్‌

5 Feb, 2021 03:56 IST|Sakshi

మాది రైతు బడ్జెట్‌ : ప్రధాని 

చౌరీచౌరా ఘటనకు వందేళ్లు పూర్తయిన కార్యక్రమంలో మోదీ  

గోరఖ్‌పూర్‌: ఓటు బ్యాంకు రాజకీయాల చుట్టూ గత ప్రభుత్వాలు బడ్జెట్‌ను రూపకల్పన చేసేవని, అమలు కాని హామీలు ఇవ్వడానికి బడ్జెట్‌ను ఒక వేదికగా చేసుకునేవారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. దానికి భిన్నంగా తమ ప్రభుత్వం రైతులకు లాభం చేకూరేలా బడ్జెట్‌ని రూపొందించిందని చెప్పారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో చౌరీచౌరా ఘటనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా అందులో వీర మరణం పొందినవారి గుర్తుగా గురువారం ప్రధాని ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమరవీరుల స్మృతి చిహ్నంగా ఒక పోస్టల్‌ స్టాంపుని విడుదల చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 1922లో చౌరీచౌరాలో కాంగ్రెస్‌ కార్యకర్తలపై పోలీసులు జులుం చేస్తే ఆగ్రహంతో ఆ కార్యకర్తలు 23 మంది పోలీసుల్ని స్టేషన్‌లో బంధించి నిప్పంటించారు. పోలీసులందరూ సజీవదహనం కావడంతో 19 మందిని బ్రిటన్‌ ప్రభుత్వం ఉరితీసింది. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో గాంధీజీ తన సహాయనిరాకరణని నిలిపివేశారు. ఈ ఘటనలో ఉరికంబం ఎక్కిన వీరులకి చరిత్ర తగినంత ప్రాధాన్యం కల్పించలేదని మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన ఆయన దశాబ్దాల తరబడి మన దేశంలో బడ్జెట్‌లో అంటే ఓటు బ్యాంకును పెంచుకోవడమేనని ధ్వజమెత్తారు.

యూడీఎఫ్‌పై నడ్డా నిప్పులు
త్రిసూర్‌: కేరళలోని వామపక్ష లెఫ్ట్‌ ప్రభుత్వం, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్‌లను పక్కనబెట్టాల్సిన సమయం దగ్గరపడిందని బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా అన్నారు. ఈ రెండు కూటముల హయాంలో పాలన అవినీతిమయమైందని విమర్శించారు. రాష్ట్రంలో కమల వికాసానికి సహకరించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. త్రిసూర్‌లోని తెక్కింకాడు మైదాన్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో మహిళలు, దళితులపై అత్యాచార కేసులు పెరిగిపోయాయన్నారు. సీఎం విజయన్‌తో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కాంగ్రెస్‌ విధానాలు భక్తులను వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయన్నారు. శబరిమల అంశంపై జరిగిన ఆందోళనల సందర్భంగా పోలీసు కేసులన్నీ బీజేపీ కార్యకర్తలపైనే నమోద య్యాయని చెప్పారు. 

మరిన్ని వార్తలు