నా పుట్టినరోజుకు ఆ గిఫ్ట్ కావాలి: నరేం‍ద్ర మోదీ

18 Sep, 2020 10:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేం‍ద్ర మోదీ గురువారం తన 70వ పుట్టిన రోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికి ఆయన ట్వి‍ట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా తనకు ఏం కావాలంటూ చాలామంది అడిగారని వారందరి నుంచి తాను ఒక్కటే కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజం తనకు కావాలని, తన పుట్టినరోజు బహుమతిగా ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ కరోనా మార్గదర్శకాలను పాటించాలని  ప్రధాని కోరారు. 

మోదీ ట్వీట్‌ చేస్తూ ‘నా పుట్టిన రోజుకు ఏం కావాలని చాలా మంది అడిగారు. నాకు ఇప్పుడు ఏం కావాలంటే: అందరూ మాస్క్‌ను  పద్దతిగా ధరించాలి. సామాజిక దూరాన్ని పాటించాలి. గుర్తుంచుకోండి. ఒక గజం దూరాన్ని పాటించాలి. రద్దీగా ఉండే ప్రదేశాల్లోకి వెళ్లకండి. రోగనిరోధక శక్తిని పెంచుకోండి. మన భూమిని ఆరోగ్యవంతంగా మార్చండి’ అని ట్వీట్‌ చేశారు. భారత దేశంలో ఇప్పటి వరకు 51 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం ఒక్క రోజే 97,894 కేసులు కొత్తగా నమోదు కాగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటకలలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

ఇక మోదీ పుట్టిన రోజు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాత్రి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో మోదీ, ట్రంప్‌, ఆయన భార్య మెలానియా స్టేజీ మీద ఉన్న ఫోటోను షేర్‌ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత ప్రధాని నరేంద్రమోదీకి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. గొప్ప నాయకుడికి, విశ్వాసమైన స్నేహతుడికి నా శుభాకాంక్షలు’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. 

ఇక ట్రంప్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా ట్రంప్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు వివిధ దేశాధినేతలు కూడా ట్రంప్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మోదీ పుట్టిన రోజు సందర్భంగా బీజేపీ బియ్యం దానం చేయడం, రక్తదానం, కంటి పరీక్షలు నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేపట్టింది. 

చదవండి: ప్రధానికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ       

మరిన్ని వార్తలు