జనాభా నియంత్రణ.. యూసీసీపై ప్రైవేటు బిల్లులు!

13 Jul, 2021 12:50 IST|Sakshi

న్యూఢిల్లీ: రాబోయే వర్షాకాల సమావేశాల్లో జనాభా నియంత్రణ, ఉమ్మడి సివిల్‌ కోడ్‌(యూసీసీ)పై ప్రైవేట్‌ బిల్లులు ప్రవేశపెట్టేందుకు బీజేపీ ఎంపీలు సిద్ధమవుతున్నారు. ఈమేరకు వారు యత్నిస్తున్న విషయాన్ని పార్లమెంట్‌ సెక్రటేరియట్లకు ఇద్దరు ఎంపీలు వెల్లడించారు. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం జనాభా నియంత్రణ ముసాయిదా బిల్లును తెచ్చింది. అసోం సైతం ఇలాంటి బిల్లు తెచ్చే యోచనలో ఉంది. ఇదే బాటలో దేశవ్యాప్తంగా అమలయ్యేలా జనాభా నియంత్రణ బిల్లు తెచ్చేందుకు బీజేపీ ఎంపీలు యత్నిస్తున్నారు. యూపీకే చెందిన లోక్‌సభ ఎంపీ రవికిషన్‌ జనాభా నియంత్రణ బిల్లును, రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ ఎంపీగా వ్యవహరిస్తున్న కిరోరి లాల్‌ మీనాలు యూసీసీ బిల్లును సమావేశాల జూలై 24న ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. మరి కొందరు ఎంపీలు సైతం ఈ బిల్లుల కోసం నోటీసులు ఇచ్చారు. 

మంత్రులు కాకుండా సాధారణ సభ్యులు ప్రవేశపెట్టే బిల్లులను ప్రైవేట్‌ బిల్లులంటారు. వీటికి సంపూర్ణ ఆమోదం లభించకుండా చట్టరూపం దాల్చలేవు. అయితే ఈ బిల్లులు బీజేపీ ఎజెండాలో భాగం కనుక వీటిపై జరిగే చర్చలు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇవన్నీ ఒక వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్న యత్నాలంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.ఈ బిల్లులోని ఏక సంతాన నిబంధనను విశ్వహిందూ పరిషత్‌ వ్యతిరేకిస్తోంది. ఈ నిబంధనతో ఇప్పటికే హిందూ, ముస్లిం జనాభా అసమతుల్యత మరింత పెరుగుతుందని అభ్యంతరాలు చెబుతోంది. బిల్లు ఉద్దేశాన్ని వ్యతిరేకించడం లేదని, బిల్లులో కొన్ని క్లాజులపై అభ్యంతరాలున్నాయని సంస్థ ప్రతినిధి అలోక్‌ కుమార్‌ యూపీ లాకమిషన్‌కు లేఖ రాశారు. 1970 తర్వాత ఇంతవరకు ఒక్క ప్రైవేట్‌ బిల్లు కూడా పార్లమెంటులో ఆమోదం పొందలేదు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు