ప్రైవేట్‌ ఆస్పత్రి నిర్వాకం.. ఠాగూర్‌ సినిమా సీన్‌ను తలపించారు

2 Jun, 2021 15:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: ఠాగూర్‌ సినిమాలోని ఆస్పత్రి సీన్‌ను తలపించారు తెరుప్పూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి నిర్వాహకులు. విషమంగా ఉన్న రోగి కోలుకుంటున్నాడని చెప్పి రూ.19 లక్షలు వసూలు చేసిన ఆస్పత్రి నిర్వాకంపై కుటుంబ సభ్యులు తిరుప్పూర్‌ కలెక్టర్‌ను ఆశ్రయించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యానికి తీసుకోవాల్సిన ఫీజులపై ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. అయితే అనేక ఆస్పత్రులు దోపిడే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే పలు ఆస్పత్రులపై ఫిర్యాదులు హోరెత్తాయి.

ఈ పరిస్థితుల్లో తిరుప్పూర్‌లోని ఓ ఆస్పత్రి లీలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలు...తిరుప్పూర్‌కు చెందిన సుబ్రమణ్యం (62) మే 3న కరోనా బారినపడ్డారు. ఆయన్ను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి్పంచారు. మే 23న ఆస్పత్రి సిబ్బంది సుబ్రమణ్యం తనయుడు కార్తికేయన్‌తో మాట్లాడి బిల్లు చెల్లించాలని కోరారు. 

బిల్లు కట్టించుకుని.. 
సుబ్రమణ్యం ఆరోగ్యంగా ఉన్నట్టు, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తున్నట్టు పేర్కొనడంతో రూ. 19 లక్షలను కార్తికేయన్‌ చెల్లించాడు. అయితే, ఆ మరుసటి రోజు రాత్రే సుబ్రమణ్యం ఆరోగ్యం విషమించినట్టు, పూర్తి స్థాయిలో ఆక్సిజన్‌ అందించలేని పరిస్థితి ఉందని ఆస్పత్రి వర్గాలు హడావుడి సృష్టించాయి. దీంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాయి. ఆగమేఘాలపై మరో ఆస్పత్రికి తరలించగా సుబ్రమణ్యం మరణించాడు. అయితే తొలుత చికిత్స పొందిన ఆస్పత్రిపై అనుమానం కలగడంతో మంగళవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. కంప్యూటరైజ్డ్‌ బిల్లు కాకుండా చేతితో రాసిన బిల్లులు ఇచ్చి ఉండటం గమనార్హం. జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది.

చదవండి: భార్యను చంపి నాటకం.. ఘరానా ఎస్సై అరెస్ట్‌
వైరల్‌: వయసు డెబ్బై ఆరు.. ఈ విషయంలో యమ హుషారు‌!

మరిన్ని వార్తలు