ప్రైవేట్‌ రైళ్లలో చార్జీలపై పరిమితి లేదు

3 Aug, 2020 04:52 IST|Sakshi

చార్జీలను ప్రైవేట్‌ సంస్థలే నిర్ణయించుకోవచ్చు 

రైల్వే శాఖ స్పష్టీకరణ

న్యూఢిల్లీ:  దేశంలో ప్రైవేట్‌ రంగంలో త్వరలో ప్రవేశపెట్టబోయే రైళ్లలో ప్రయాణ చార్జీలపై పరిమితి ఉండబోదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. చార్జీలపై నిర్ణయం ప్రైవేట్‌ సంస్థలదేనని, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో 151 ప్రైవేట్‌ రైళ్లను 35 ఏళ్లపాటు నడిపేందుకు అనుమతిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చార్జీల విషయంలో ప్రైవేట్‌ బిడ్డర్లు పలు సందేహాలు లేవనెత్తారు. మార్కెట్‌ డిమాండ్‌ను బట్టి ప్రైవేట్‌ సంస్థలే చార్జీలను నిర్ధారించవచ్చని తాజాగా రైల్వే శాఖ తెలియజేసింది.

రైల్వేస్‌ యాక్ట్‌ ప్రకారం దీనికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం లేదా పార్లమెంట్‌ అంగీకారంతో చట్టబద్ధత కల్పించాల్సి ఉందని రైల్వే  వర్గాలు తెలిపాయి. సాధారణంగా రైలు చార్జీలను రైల్వే శాఖ లేదా కేంద్ర ప్రభుత్వం  నిర్ణయిస్తాయి. ప్రైవేట్‌ రైళ్లలో అత్యాధునిక వసతులు ఉంటాయి కాబట్టి ప్రయాణ చార్జీలు అధికంగానే ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్‌ సంస్థలు సొంతంగానే తమ వెబ్‌సైట్ల ద్వారా రైల్‌ టికెట్లు అమ్ముకోవచ్చు. కానీ, ఈ వెబ్‌సైట్లను రైల్వే ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌తో అనుసంధానించాల్సి ఉంటుంది.   

రైల్వే శాఖలో ఈ–ఆఫీస్‌ జోరు
కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైల్వే శాఖ 4 నెలలుగా ఈ–ఆఫీస్‌కు పెద్దపీట వేస్తోంది. పత్రాలు, ఫైళ్లను డిజిటల్‌ రూపంలోకి మార్చేసి, ఆన్‌లైన్‌లోనే పంపించింది. లేఖలు, బిల్లులు, ఆఫీస్‌ ఆర్డర్లు వంటి 12 లక్షలకు పైగా డాక్యుమెంట్లను, మరో 4 లక్షల ఫైళ్లకు డిజిటల్‌ రూపం కల్పించారు. దీంతో నిర్వహణ వ్యయం కూడా భారీగా తగ్గింది. 2019 మార్చి నుంచి 2020 మార్చి వరకు రైల్వే శాఖ ఆన్‌లైన్‌లో 4.5 లక్షల ఈ–రసీదులు జారీ చేయగా, 2020లో ఏప్రిల్‌ నుంచి జూలై వరకు 16.5 లక్షల ఈ–రసీదులను జారీ చేసింది. ఈ–ఫైళ్ల సంఖ్య 1.3 లక్షల నుంచి 5.5 లక్షలకు పెరిగింది.

మరిన్ని వార్తలు