కరీంనగర్‌ సీపీపై చర్యలు తీసుకోండి

22 Jan, 2022 03:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ, మరికొందరు పోలీసు అధికారులు తనపై దాడి చేసి, అక్రమంగా అరెస్టు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీకి విజ్ఞప్తి చేశారు. సీపీతోపాటు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం ఢిల్లీలో లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ ముందు బండి సంజయ్‌ హాజరై తన వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 317ను సవరించాలంటూ ఈ నెల 2న కరీంనగర్‌లోని తన కార్యాలయంలో దీక్ష చేపట్టానని.. కానీ కొందరు పోలీసు అధికారులు అక్రమంగా దాడి చేసి, అరెస్టు చేశారని ఫిర్యాదు చేశారు.

పోలీసుల తీరును, అరెస్టును హైకోర్టు కూడా తప్పుపట్టిన విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. కరీంనగర్‌ సీపీ సత్యనారాయణ, ఇతర పోలీసులు తనపై దాడి చేయడం ఇది రెండోసారని వివరించారు. 2019 అక్టోబర్‌లో ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆర్టీసీ కార్మికుడు నగునూరు బాబు అంత్యక్రియలకు వెళుతుండగా.. పోలీసులు తనను అడ్డుకుని, క్రూరంగా దాడి చేశారని ప్రివిలేజ్‌ కమిటీకి సంజయ్‌ వెల్లడించారు.

తాజా ఘటన లో సీపీ సత్యనారాయణ, హుజూరాబాద్‌ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి, జమ్మికుంట ఇన్‌స్పెక్టర్‌ కొమ్మినేని రాంచందర్‌రావు, హుజూరాబా ద్‌ ఇన్‌స్పెక్టర్‌ వీ.శ్రీనివాస్, కరీంనగర్‌ సీసీఎస్‌ ఏసీపీ కె.శ్రీనివాస్, కరీంనగర్‌ టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ చల్లమల్ల నరేశ్‌ సహా గుర్తు తెలియని ఇతర పోలీస్‌ సిబ్బంది ఈ నెల 2న తనపై దాడి చేశారని సంజయ్‌ వివరించారు. ఆ రోజు జరిగిన ఘటనలకు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలతో పాటు వీడియో క్లిప్పింగులను కమిటీకి సమర్పించారు.  

మరిన్ని వార్తలు