శ్రద్ధా వాకర్‌ హత్య కేసు: చదువుకున్న అమ్మాయిల విషయంలోనే ఇలాంటి ఘటనలు!

18 Nov, 2022 10:29 IST|Sakshi

బాగా చదువుకుని, తాము చాలా ఓపెన్‌గా.. నిష్కపటంగా(ఫ్రాంక్‌గా) ఉన్నామని, భవిష్యత్తు గురించి ఎలాంటి నిర్ణయాలైనా తమంతట తాముగా తీసుకోగలమని భావించే అమ్మాయిల విషయంలోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు సహజీవనం అనేది ఎందుకు? ఒకవేళ అలాంటి బంధాలు అవసరం అనుకుంటే.. అధికారికంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి!. ఒకవేళ తల్లిదండ్రులు అలాంటి వాటికి ఒప్పుకోకపోతే.. న్యాయబద్ధంగా పెళ్లి చేసుకుని కలిసి ఉండాలి... !

శ్రద్ధావాకర్‌ హత్యోందతాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి కౌశల్‌ కిషోర్‌ చేసిన పైవ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చదువుకున్న అమ్మాయిలు సహజీవనం పేరుతో తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్లడం సరికాదంటూ వ్యాఖ్యానించారాయన. ఈ వ్యాఖ్యలను శివసేన నేత ప్రియాంక చతుర్వేది ఖండించారు. తక్షణమే ఆయన్ని మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారామె. 

‘‘అలా ఎందుకు చేస్తున్నారో అనే విషయంపై అమ్మాయిలే జాగ్రత్త పడాలి. చదువుకున్న అమ్మాయిలు అలాంటి బంధాలకు దూరంగా ఉండాలి. అసలు తల్లిదండ్రులు అలాంటి బంధాలకు ఒప్పుకోనప్పుడు.. పూర్తి బాధ్యత ఆ చదువుకున్న అమ్మాయిలదే అవుతుంది కూడా’’ అని మంత్రి కౌశల్‌ ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. 

‘‘ఈ దేశంలో పుట్టడానికి ఆడపిల్లలే కారణమని చెప్పకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. సిగ్గులేని, హృదయం లేని, క్రూరమైన వాళ్ల వల్ల అన్ని సమస్యలకు స్త్రీని నిందించే మనస్తత్వం అభివృద్ధి చెందుతూనే ఉంది అని ఆమె పేర్కొన్నారు. నారీశక్తికి కట్టుబడి ఉంటే తక్షణమే ఆయన్ని తొలగించాలంటూ ప్రధాని కార్యాలయాన్ని డిమాండ్‌ చేస్తూ ఆమె ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: అఫ్తాబ్‌పై ఆ పరీక్షలు నిర్వహిస్తారా?

మరిన్ని వార్తలు