మట్టిలో పరుగులు తీసిన ప్రియాంక గాంధీ

3 Mar, 2021 15:05 IST|Sakshi

మీటింగ్‌కు ఆలస్యం కావడంతో పరిగెత్తుకుంటూ వచ్చిన ప్రియాంక

గుహవటి: కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ ప్రస్తుతం అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. నిన్న టీ ఎస్టేట్‌లో కూలీలతో కలిసి ఆమె కూడా తేయాకు తెంపిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు ప్రియాంక గాంధీకి సంబంధించిన మరో వీడియో వైరలవుతోంది. ఆమె పరిగెత్తుతూ సభా వేదిక వద్దకు వస్తోన్న వీడియో ఇది.  ఆ వివరాలు..  ప్రియాంకా గాంధీ మంగళవారం అస్సాంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరుకావాల్సి ఉండగా కాస్త ఆలస్యమైంది.

ఆ సమయాన్ని కవర్ చేసేందుకు పరిగెత్తుకుంటూ వేదిక వద్దకు వచ్చారు. మెరూన్‌ రంగు చీరలో ఉన్న ప్రియాంక గాంధీ మట్టిలో పరుగులు తీస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆమె చుట్టు బాడీగార్డులు కూడా ఉన్నారు. ప్రియాంక గాంధీ పరిగెత్తుకుంటూ వస్తుండగా.. అక్కడ నిల్చొన్న జనం చప్పట్లు కొడుతూ ఆమెకు స్వాగతం పలికారు. వారందరికి చేతులు జోడించి నమస్తే చెబుతూ.. ప్రియాంక వేదిక వద్దకు చేరుకున్నారు. 

అనంతరం ప్రియాంక గాంధీ ప్రసంగిస్తూ.. ‘‘రెండు నెలలుగా 3లక్షల మందికి పైగా రైతులు ధర్నాలో కూర్చున్నారు. వారంతా ప్రధాని ఉండే ప్రాంతానికి కేవలం నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటున్నారు. కానీ, ప్రధానికి వారిని కలవడానికి తీరిక దొరకడం లేదు. ఒకసారి వెళ్లి రైతులను కలిస్తే ఏమవుతుంది. చట్టాల వల్ల రైతులకు ఎదురయ్యే సమస్యల గురించి చర్చిస్తే బాగుంటుంది కదా. అప్పడు వారికి లాభం చేకూర్చేలాగే మార్పులు చేస్తే సరిపోతుంది. కానీ ఈ ప్రభుత్వం తీరు చూస్తే ఈ చట్టాలు, పాలసీలు ధనికుల కోసమే అన్నట్లుగా ఉంది’’ అంటూ ప్రియాంక మండి పడ్డారు. 

‘‘ప్రధాని నరేంద్ర మోదీ బ్రాండ్‌ను వాడుకుని డెవలప్‌మెంట్ పాలసీలు ఏమీ లేకుండానే గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్ష పార్టీలు అన్నీ కలిసి హక్కులు, సీఏఏ, ఎన్నార్సీ లాంటి అంశాలపై అస్సాంలో ప్రచారం చేపడుతున్నాయి. ఇవన్ని ఇక్కడ చాలా సున్నితమైన అంశాలు’’ అన్నారు ప్రియాంక. ఇక అస్సాంలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మూడు వేర్వేరు రోజులలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అస్సాంలో 126 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

చదవండి:
‘సరిగానే వేశానా.. బుట్టలో పడిందా?’
గెలిపిస్తే లైసెన్స్‌ ఇచ్చినట్లు కాదు.. 


 

మరిన్ని వార్తలు