‘రాముడు అందరివాడు’

4 Aug, 2020 14:50 IST|Sakshi

రాముడి ఔన్నత్యాన్ని కొనియాడిన ప్రియాంక

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో ఆగస్ట్‌ 5న రామమందిర నిర్మాణానికి శంకుస్ధాపన సందర్భంగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాముడిని కొనియాడుతూ ట్వీట్‌ చేశారు. అయోధ్య అంశంపై పార్టీ వైఖరికి సంకేతంగా రాముడు అందరివాడని, అందరి హృదయాల్లో రాముడు ఉన్నాడంటూ మంగళవారం ప్రియాంక ట్వీట్‌ చేశారు. అయోధ్యలోని రామజన్మభూమిలో బుధవారం జరిగే భూమిపూజ కార్యక్రమం జాతీయ ఐక్యతను చాటే సాంస్కృతిక సమ్మేళనంగా నిలిచిపోతుందని ఆమె వ్యాఖ్యానించారు. నిరాడంబరత, ధైర్యం, సహనం, త్యాగం, అంకితభావాలకు ప్రతీక అయిన రాముడు అందరితో ఉంటాడని ప్రియాంక హిందీలో ట్వీట్‌ చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన ప్రియాంక గాంధీ ఆ రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి జరిగే భూమిపూజకు కాంగ్రెస్‌ను ఆహ్వానించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ఈ కార్యక్రమంలో 100 మందికిపైగా వీఐపీలు పాల్గొంటారని భావిస్తున్నారు.అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ స్వాగతిస్తూ తీర్మానించిన సంగతి తెలిసిందే.

చదవండి : బీజేపీ ఎంపీకి ప్రియాంక ఆహ్వానం

మరిన్ని వార్తలు