‘ఎంపికైనా ఉద్యోగాలు ఇవ్వడం లేదు’

19 Sep, 2020 19:40 IST|Sakshi

లక్నో: నిరుద్యోగుల పట్ల యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదంటూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు శనివారం ప్రియాంకా గాంధీ లేఖ రాశారు. కాగా అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు లేక నిరుద్యోగ యువత తీవ్ర మనోవేధనకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇటీవల 12,460 మంది టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ నియామకాలలో ఉద్యోగాలు సాధించారని, కాగా వారికి ఖాళీలు లేవంటూ అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ (నియామక పత్రాలు) ఇవ్వడం లేదని విమర్శించారు.

అత్యుత్తమ ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన వారికి ప్రభుత్వం నియమించకపోవడం విచారకరమన్నారు. ఉద్యోగాలు లేక యువత ఆర్థిక సమస్యలు, డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రియాంకా విమర్శలపై యూపీ అధికారులు స్పందిస్తూ త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం లభిస్తుందని, ఇటీవల భారీ నియామకాల కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం యోగి ఆదేశించిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు