‘కేరళ ప్రభుత్వం విదేశీ బంగారంపై కన్నేసింది’

31 Mar, 2021 08:26 IST|Sakshi

కొల్లాం/కరునగపల్లి: కేరళ ప్రభుత్వం కుంభకోణాలకు, అవినీతికి నిలయంగా మారిందంటూ కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ.. పినరయి విజయన్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ తరహా విధానాలనే పినరయి ప్రభుత్వం కూడా పాటిస్తోందని వ్యాఖ్యానించారు. కేరళలో త్వరలో జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్‌ తరఫున చేస్తున్న ప్రచారంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళకు నిజమైన బంగారం ప్రజలేనని, కానీ ప్రభుత్వం మాత్రం విదేశాల నుంచి వస్తున్న బంగారంపై కన్నేసిందంటూ ‘గోల్డ్‌ స్కామ్‌’ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. స్థానిక జాలరుల కడుపుకొట్టేలా.. వేరే దేశానికి చెందిన కార్పొరేట్‌ కంపెనీకి డీప్‌ ఫిషింగ్‌కు అనుమతులు ఇచ్చారని అన్నారు.

వారి ఉద్దేశం రాష్ట్ర ఆస్తులను కార్పొరేట్లకు అమ్మడమేనని విమర్శించారు. 2017లో వలయార్‌లో జరిగిన హత్యాచార ఘటన ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఇద్దరు అమ్మాయిలపై హత్యాచారం జరిగితే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు, సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని చెప్పారు. ప్రభుత్వం వారిని శిక్షించకపోగా, అభినందించిందని అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మహిళలు ఎలా ఎన్నుకుంటారంటూ ప్రశ్నలు సంధించారు. 
చదవండి: మెహబూబా తల్లికి పాస్‌పోర్ట్‌ నిరాకరణ

మరిన్ని వార్తలు