హై కోర్టు ఆదేశాలపై ప్రియాంక గాంధీ హర్షం

2 Oct, 2020 14:22 IST|Sakshi

లక్నో: హత్రాస్‌ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి పక్షాలు యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఘటనకు సంబంధించి అలహాబాద్‌ హై కోర్టు ప్రభుత్వ ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. కోర్టు ఆర్డర్‌ని బలమైన, ప్రోత్సాహకరమైన పరిణామంగా ప్రశంసించారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. ‘హత్రాస్‌ అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని దేశం మొత్తం కోరుతుంది. యూపీ ప్రభుత్వం తన కుటుంబానికి చేసిన అమానవీయ, దారుణ అన్యాయం నేపథ్యంలో హై కోర్టు తీర్పు కటిక చీకటిలో చిరుదివ్వెలా ఆశాజనకంగా ఉంది’ అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి అలహాబాద్‌ హై కోర్టు లక్నో బెంచ్‌ యూపీ పోలీసులు, పరిపాలన ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న వారు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. (చదవండి: ఇదేమి సంస్కృతి?)

అంతేకాక బాధితురాలి కుటుంబ సభ్యులను కూడా కోర్టుకు హాజరుకావాల్సిందిగా సూచించింది. వారు కూడా వస్తే దహన సంస్కారల విషయంలో అసలు ఏం జరగిందనేది తెలుస్తుందని కోర్టు అభిప్రాయ పడింది. అంతేకాక ‘ఈ కేసు అపారమైన ప్రజా ప్రాముఖ్యత, ప్రజాప్రయోజనంతో కూడుకున్నది. ఎందుకంటే ఈ కేసులో రాష్ట్ర అధికారులు అధికంగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరణించిన బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యుల ప్రాథమిక మానవ హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయి. నేరానికి పాల్పడిన వారు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. ఈ కేసుకు సంబంధించి సంచలన ఆరోపణలు వినవస్తున్నాయి. అవన్ని నిజమైతే అధికారులు ఆ కుటుంబానికి శాశ్వత దుఃఖాన్ని మిగిల్చిన వారవుతారు. వారి ప్రవర్తన పుండు మీద ఉప్పు రుద్దిన చందంగా ఉన్నట్లు జనాలు గుర్తిస్తారు’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. 

మరిన్ని వార్తలు