కమలపై ప్రియాంక ట్వీట్‌: 50 ఏళ్ల కిందటే

20 Nov, 2020 10:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన కమల హ్యారిస్కు శుభాకాంక్షల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ దేశాల అధినేతలు ఆమెను ప్రసంశిస్తూ సందేశాలు పంపుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రధాన పార్టీల ముఖ్యనేతలు కూడా ఆమెను అభినందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సైతం ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రియాంక ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాకు ఓ మహిళను ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకునేందుకు శాతాబ్ధాల సమయం పట్టిందని, భారత్‌లో మాత్రం 50 ఏళ్ల కిందటే ఓ మహిళ (ఇందిరా గాంధీ)ను దేశ ప్రధానిగా ఎన్నుకున్నారని గుర్తుచేశారు. (ప్రపంచానికి అమెరికా ఓ దిక్సూచి)

నవంబర్‌ 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రియాంక గురువారం ఓ ట్వీట్‌ చేశారు. మాజీ ప్రధానికి నివాళి అర్పిస్తూనే దేశ ప్రజాస్వామ్య గొప్పతనాన్ని వర్ణించారు. 50 ఏళ్ల కిందటనే ఇందిరను ప్రధానిగా ఎన్నుకున్న దేశ ప్రజలు ఎంతో గొప్పవారని కొనియాడారు. అమెరికా మాత్రం ఈ ఘనతను సాధించేందుకు శాతాబ్ధాల సమయం పట్టిందన్నారు. ట్విటర్‌లో ఆమె చిన్నప్పుడు ఇందిరతో దిగిన ఫోటోను జతచేశారు. 1966 జనవరిలో ఇందిరా గాంధీ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడిగా జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమల హ్యారిస్ విజయం సాధించారు. 2021 జనవరి 20న వారు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

మరిన్ని వార్తలు