నానమ్మను గుర్తు చేసిన ప్రియాంక.. ఫోటోలు వైరల్‌

11 Feb, 2021 17:52 IST|Sakshi

మౌనీ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన ప్రియాంక

ఉ‍త్తరప్రదేశ్‌: ఐరన్‌ లేడీ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అనగానే ఆమె హెయిర్‌ స్టైల్‌తో పాటు ఆమె మెడలో ధరించే రుద్రాక్ష మాల తప్పనిసరిగా గుర్తుకు వస్తుంది. చాలా ఫోటోల్లో ఆమె మెడలోని రుద్రాక్ష మాల స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంత సడెన్‌గా ఈ చర్చ ఎందుకంటే.. ప్రస్తుతం ట్విట్టర్‌లో ప్రియాంక గాంధీ ఫోటోలు తెగ వైరలవుతోన్నాయి. ఇక ఈ ఫోటోలో అందరిని ఆకర్షిస్తోన్నది ఏంటంటే ప్రియాంక చేతికి ధరించి ఉన్న రుద్రాక్ష మాల. ఈ ఫోటోలు చూసిన నెటిజనులు ‘‘మీ నానమ్మని గుర్తు చేశారు’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

ఇక నేడు మౌనీ అమావాస్య సందర్భంగా ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని సాగర సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి.. పూజలు చేశారు. ఆ తర్వాత శంకరాచార్య స్వామీ స్వారూపానంద సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తమ కుమార్తె మిరాయ, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరాధనా మిశ్రాతోపాటు మరికొందరితో కలిసి పడవలో ఎక్కి నదిలో విహరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 

ఇక బుధవారం ప్రియాంక గాంధీ మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా సహారాన్‌పూర్‌లో నిర్వహించిన రైతుల మహాపంచాయతీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నాయకులు నిరసనకారులను ‘‘ఆందోళన్‌ జీవి’’ అంటూ అవమానించారని ఆరోపించారు. అలానే కేంద్రం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట యమపాశాలని వ్యాఖ్యానించారు. 

ఇక వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే.. ఈ చట్టాలను రద్దు చేస్తానని ప్రియాంక గాంధీ ప్రకటించారు. ప్రభుత్వం రైతులను అర్థం చేసుకోవడం లేదని.. వారి పక్షాన నిలబడటం లేదని ఆరోపించారు. రైతులను దేశ ద్రోహులంటున్నవారే అసలైన దేశ ద్రోహులని మండిపడ్డారు ప్రియాంక గాంధీ. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోపే పార్టీని పునరుద్ధరించే ప్రయత్నంలో ఉన్న కాంగ్రెస్ యూపీ ఇన్‌ఛార్జి ప్రియాంక గాంధీ తరచుగా రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. 

చదవండి: కమలపై ప్రియాంక ట్వీట్‌: 50 ఏళ్ల కిందటే
                   ఏడు గుర్రాల జోడీ

మరిన్ని వార్తలు