ఫోన్‌లో కేంద్ర మంత్రి గొంతు గుర్తుపట్టని అధికారి.. దర్యాప్తునకు ఆదేశం!

30 Aug, 2022 15:03 IST|Sakshi

లక్నో: పైఅధికారులు ఫోన్‌ చేస్తేనే ఎంతో హడావిడి చేస్తారు అధికారులు. అలాంటిది కేంద్ర మంత్రి ఫోన్‌ అంటే మరి ఎలా ఉంటుంది? కానీ, ఫోన్‌ చేసిన కేంద్రమంత్రి గొంతును గుర్తుపట్టకపోవడం వల్ల ఓ అధికారి ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గ ఎంపీ స్మృతి ఇరానీ ఫోన్‌ చేయగా ఓ శాఖలో పని చేస్తున్న క్లర్క్‌ గుర్తించకపోవటంతో ఆయనపై దర్యాప్తునకు ఆదేశించారు.

ఏం జరిగింది?
అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగస్టు 27న పర్యటించారు. అదే సమయంలో ముసఫిర్ఖానా తహసిల్‌లోని పూరే పహల్వాన్‌ గ్రామానికి చెందిన కరుణేశ్‌(27) అనే వ్యక్తి తన తల్లికి పెన్షన్‌ మంజూరు కాలేదనే విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్థానిక కార్యాలయంలో క్లర్క్‌ దీపక్‌ కారణమని పేర్కొన్నారు. పెన్షన్‌ దరఖాస్తును ఇంకా అతడు ధ్రువీకరించలేదని తన గోడు వెల్లబోసుకున్నాడు. వెంటనే స్పందించిన స్మృతి ఇరానీ.. ఆ అధికారికి ఫోన్‌ చేశారు. కానీ, ఆ వ్యక్తి మాత్రం కేంద్ర మంత్రి గొంతును గుర్తు పట్టలేకపోయారు. దీంతో ఆమె పక్కనే ఉన్న జిల్లా ఉన్నతాధికారి ఆ ఫోన్‌ తీసుకొని క్లర్క్‌తో మాట్లాడారు. వెంటనే కార్యాలయానికి రావాలని స్పష్టం చేశారు.

ఈ విషయంపై విచారణ జరపాలని జిల్లా అధికారులకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సూచించారు. కరుణేశ్‌ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన అధికారులు.. క్లర్క్‌ నిర్లక్ష్యం వహించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై ముసఫిర్ఖానా సబ్‌డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ విచారణ జరుపుతారని.. నివేదిక ప్రకారం నిర్లక్ష్యం వహించిన అధికారిపై చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: మోదీ రోజుకు ఏడు సార్లు నమాజ్ చేసేవారు.. కాంగ్రెస్ మహిళా నేత వ్యాఖ్యలపై దుమారం..

మరిన్ని వార్తలు