జ్ఞాన‌వాపి మ‌సీదుపై వివాదాస్పద వ్యాఖ‍్యలు.. ఢిల్లీలో కలకలం

21 May, 2022 12:41 IST|Sakshi

వార‌ణాసిలోని జ్ఞాన‌వాపి మ‌సీదుపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. జ్ఞాన్‌వాపి మసీదు వీడియోగ్రాఫి సర్వే అభ్యంతర పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ వాడివేడీగా సాగిన విషయం తెలిసిందే. ఈ కేసు పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని, జోక్యం చేసుకోబోమని బెంచ్‌.. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌ శివలింగాన్ని సంరక్షించడంతో పాటు నమాజ్‌ కొనసాగించుకోవచ్చన్న మధ్యంతర ఆదేశాలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. అంతేకాదు.. ట్రయల్‌ జడ్జి కంటే అనుభవం ఉన్న జిల్లా జడ్జి సమక్షంలోనే వాదనలు జరగడం మంచిదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ తరుణంలో జ్ఞాన్‌వాపి మసీదు విషయంపై ఢిల్లీ యూనివ‌ర్సిటీలోని హిందూ కాలేజీ హిస్టరీ సబ్జెక్ట్‌ అసోసియేట్ ప్రొఫెస‌ర్ ర‌త‌న్ లాల్ సోషల్‌ మీడియాలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సోషల్‌ మీడియాలో..‘‘దేశంలో మీరు దేని గురించి మాట్లాడినా.. అది మరొకరి సెంటిమెంట్‌ను దెబ్బతిస్తుంది. ఇది కొత్తేమీ కాదు. నేను చరిత్రకారుడిని, అనేక పరిశీలనలు చేశాను. నా పరిశీలనలో నేను అన్వేషించిన వాటి గురించి రాశాను. నన్ను నేను రక్షించుకుంటాను’’ అని వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఢిల్లీ లాయ‌ర్ వినీత్ జిందాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు లాల్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఐపీసీ 153ఏ, 295ఏ కింద ప్రొఫెస‌ర్‌ను అరెస్టు చేసిన‌ట్లు ఢిల్లీ సైబ‌ర్ పోలీసులు తెలిపారు. ప్రొఫెస‌ర్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిధంగా ఉన్నట్లు లాయ‌ర్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. జ్ఞాన్‌వాపి మసీదు సమస్యపై తాను కామెంట్స్‌ చేసిన తర్వాత తన 20 ఏళ్ల కుమారుడికి ఫేస్‌బుక్ మెసెంజర్‌లో బెదిరింపులు వస్తున్నాయని రతన్‌ లాల్‌ తెలిపారు. లాల్ తన టీచింగ్ ఉద్యోగంతో పాటు, దళిత సమస్యలపై దృష్టి సారించే ‘అంబేద్కర్‌నామా’ అనే న్యూస్ పోర్టల్ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు.. రతన్‌ లాల్‌ అరెస్ట్‌ను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ఖండించారు. ట్విట్టర్‌ వేదికగా.. ‘‘ప్రొఫెసర్ రతన్‌ లాల్ అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజ్యాంగబద్ధమైన అభిప్రాయం, భావ వ్యక్తీకరణ హక్కు ఆయనకు ఉంది.’’ అంటూ దిగ్విజయ్‌ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: జ్ఞానవాపి మసీదు పిటిషన్‌: వీడిన సస్పెన్స్‌.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

మరిన్ని వార్తలు