-

నూహ్‌లో మళ్లీ ఇంటర్నెట్‌ సేవలు బంద్‌

27 Aug, 2023 06:34 IST|Sakshi

శోభాయాత్ర దృష్ట్యా హరియాణా ప్రభుత్వం నిర్ణయం

చండీగఢ్‌: శోభాయాత్ర పిలుపు నేపథ్యంలో నూహ్‌ జిల్లాలో ఈ నెల 28 వరకు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం విధించడంతోపాటు నిషేధాజ్ఞలు అమలు చేయాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 31వ తేదీన జరిగిన మతపర ఘర్షణల నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చర్యలు తీసుకున్నట్లు వివరించింది. నూహ్‌లో సోమవారం తలపెట్టిన శోభాయాత్రకు అనుమతులు నిరాకరించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఢిల్లీలో సెప్టెంబర్‌ 3 నుంచి 7వ తేదీ వరకు జరిగే జి–20 షెర్పా సమావేశాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయించామన్నారు. మొబైల్‌ ఇంటర్నెట్‌తోపాటు ఎస్‌ఎంఎస్‌ సర్వీసులపైనా నిషేధం విధించామన్నారు. సంఘ విద్రోహ శక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా వదంతుల వ్యాప్తి చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యమని చెప్పారు. ఈ నెల 26–28 తేదీల మధ్య 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని డీజీపీ శత్రుజీత్‌ కపూర్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు