ఆ ఎనిమిది చీతాలకు రక్షణ.. సూపర్ స్నిఫర్ ప్రత్యేకతలు ఇవే!

27 Sep, 2022 18:50 IST|Sakshi

ప్రాజెక్టు చీతాలో భాగంగా.. నమీబియా నుంచి తెప్పించిన చీతాలను భద్రంగా చూసుకునే పనిలో ఉన్నారు కునో నేషనల్‌ పార్క్‌(మధ్యప్రదేశ్‌) అటవీశాఖ అధికారులు. నెలపాటు అవి క్వారంటైన్‌లోనే ఉండాలి గనుక.. బయటి ప్రాంతపు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే వీటి పహారా కోసం రెండు గజరాజులను మోహరించారు. ఇక ఇప్పుడు నాలుగు కాళ్ల కమాండర్‌లు వాటిని పరిరక్షించేందుకు శిక్షణ తీసుకోవడంలో తలమునకలయ్యాయి.  

నమీబియా చీతాల సంరక్షణ కోసం సూపర్‌ స్నిఫర్‌ బృందాన్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఐటీబీపీ(ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ ఫోర్సెస్‌) సెంటర్‌ వద్ద శిక్షణ తీసుకున్న ఇలూ అనే ఆడ జర్మన్‌ షెపర్డ్‌ ఈ బృందంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనితో పాటు దేశంలోని వివిధ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల వద్ద పని చేసిన ఐదు శునకాలు ఇలూకు తోడు కానున్నాయి. నమీబియా చీతాలను వేటగాళ్ల బారి నుంచి రక్షించడంలో ఈ స్నిఫర్‌ బృందం కీలకంగా వ్యవహరించబోతోంది. 

మూడు నెలల ప్రాథమిక శిక్షణ, మరో నాలుగు నెలల అడ్వాన్స్‌డ్‌ శిక్షణ పూర్తి చేసుకున్నాక వీటిని కునో నేషనల్‌ పార్క్‌ వద్ద మోహరిస్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇవి రంగంలోకి దిగుతాయి. 

 శిక్షణలో.. పెద్దపులి, చిరుతల చర్మాలను, ఎముకలను, ఏనుగు దంతాలు, ఇతర భాగాలను, వన్యప్రాణులను అక్రమంగా తరలించడాన్ని ఇవి పసిగట్టి అప్రమత్తం చేస్తాయి. 

 దేశంలో సూపర్‌ స్నిఫర్‌ స్క్వాడ్స్‌ ఇప్పటికే విధులు నిర్వహిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా, ఉత్తర ప్రదేశ్‌, గుజరాత్‌, తమిళనాడులో ఇప్పటికే ఈ తరహా టీంలు పని చేస్తున్నాయి. 

 సూపర్‌ స్నిఫర్‌ స్క్వాడ్స్‌లో.. శునకాలు నెలల వయసు ఉన్నప్పటి నుంచే శిక్షణ ప్రారంభిస్తారు. శిక్షణ మొదటి రోజు వాటి రిటైర్‌మెంట్‌ వరకు ఒకే శిక్షకుడు వెంటే ఉంటాడు.

 కేవలం చీతాలకు మాత్రమే కాదు.. కునో నేషనల్‌ పార్క్‌లోని ఇతర వన్యప్రాణులను సైతం వేటగాళ్ల నుంచి రక్షించేందుకు ఈ బృందం పని చేస్తుందని ఇలూ శిక్షకుడు సంజీవ్‌ శర్మ చెప్తున్నారు. 

► ఐటీబీపీ కేంద్రాల్లో శిక్షణ పొందిన శునకాలు.. వన్యప్రాణుల నేరాలను గుర్తించడంలో ఎక్కువ విజయాన్ని సాధించాయి. వేటగాళ్లను పట్టించడంలో.. వన్యప్రాణుల అవశేషాలను పట్టించడంలో ఇంతకు ముందు అవి ఎంతో కీలకంగా వ్యవహరించాయి. 

 భారత దేశంలో రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్పీఎఫ్‌) కూడా వైల్డ్‌లైఫ్‌ స్నిఫర్‌ డాగ్‌ బృందాల సేవలను వినియోగించుకుంటున్నాయని ఐటీబీపీ అధికారులు చెప్తున్నారు. 

 రైల్వే నెట్‌వర్క్‌ల గుండా జరిగే అక్రమ రవాణా, అరుదైన జీవజాలం తరలింపు ప్రయత్నాలను ఇవి భగ్నం చేసిన సందర్భాలను సైతం గుర్తు చేస్తున్నారు. 

 వన్యప్రాణుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు.. 2008లో TRAFFIC, WWF-Indiaలు సంయుక్తంగా వైల్డ్‌ లైఫ్‌ స్నిఫర్‌ డాగ్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాంను ప్రారంభించాయి. వీటి ద్వారా శిక్షణ పొందిన శునకాలు.. ఇప్పుడు వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వద్ద మోహరించబడ్డాయి.

మరిన్ని వార్తలు