వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత: మరిన్ని చిక్కుల్లో నూపుర్‌ శర్మ

9 Jun, 2022 10:58 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇస్లాం మత వ్యవస్థాపకుడు మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు రోజురోజుకీ ఆమెను మరిన్ని చిక్కుల్లోకి నెట్టేస్తున్నాయి. తాజాగా సస్పెండెడ్‌ బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతోపాటు నవీన్‌ జిందాల్‌ జర్నలిస్ట్‌ సబా నఖ్వీ, షాదాబ్ చౌహాన్, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్‌పై కూడా ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. మొత్తం  ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. 

సోషల్‌ మీడియాలో మత విద్వేశాలను వ్యాప్తి చేసి ప్రజల ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించారని పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు.  దేశంలో అశాంతిని సృష్టించే ఉద్ధేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై కూడా దర్యాప్తు చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. 
సంబంధిత వార్త: గుజరాత్‌లో నూపుర్‌ శర్మ వ్యతిరేక పోస్టర్లు.. అరెస్ట్‌కు డిమాండ్‌

అసలేం జరిగిందంటే
కాగా ఓ టీవీ డిబెట్‌లో పాల్గొన్న నూపుర్‌ మహమ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ బీజేపీ మీడియా ఇంచార్జీ నవీన్ కుమార్ జిందాల్ కూడా మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర ట్వీట్లు చేశారు. వీరిద్దరి వ్యాఖ్యలు తీవ్ర  ఆందోళనలు రేపాయి. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్‌లోని  కాన్పూర్‌లో తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. ఈ ఘర్షణలకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 1500 మందిపై కేసులు నమోదయ్యాయి. 

అయితే మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దిద్దుబాటు చర్యగా నూపుర్‌ శర్మను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు బీజేపీ వెల్లడించింది..అలాగే పార్టీ సస్పెండ్‌ చేసిన అనంతరం తన వ్యాఖ్యలపై నూపుర్‌ శర్మ క్షమాపణలు కోరారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్ధేశం కాదని, తన వ్యాఖ్యలు ఎవరైనా బాధపడితే, బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. అయినా ఈ వ్యాఖ్యలపై ఆగ్రహా జ్వాలలు చల్లారలేదు.

దేశంలోనే కాకుండా అరబ్‌ దేశాల్లోనూ దుమారం రేపాయి. తమ మత విశ్వాసాలను కించపరిచితే ఊరుకునేది లేదని ఇస్లామిక్‌ దేశాలు మండిపడుతున్నాయి. కొన్ని దేశాల్లో అయితే భారత్‌ వస్తువులు, సినిమాలు నిషేధించాలంటూ పిలుపునిచ్చే స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
చదవండి: ప్రవక్తపై వ్యాఖ్యలతో దుమారం.. భగ్గుమంటున్న ముస్లిం దేశాలు

మరిన్ని వార్తలు