ప్రజల దాడి.. ప్రాణభయంతో బీజేపీ ఎమ్మెల్యే పరుగులు

14 Aug, 2021 20:23 IST|Sakshi

లక్నో: బీజేపీ ఎమ్మెల్యేపై పలువురు దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఎమ్మెల్యే కాన్వాయ్‌ను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేను ఘెరావ్‌ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రాణభయంతో పోలీసుల భద్రతా నడుమ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకోవడం గమనార్హం. వివరాలు ఇలా ఉన్నాయి.

బుదాన నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఉమేశ్‌ మాలిక్‌ ముజఫర్‌నగర్‌లోని సిసౌలీలో శనివారం పర్యటించారు. జన కల్యాణ్‌ సమితి కార్యక్రమానికి హాజరవడానికి వచ్చిన ఎమ్మెల్యేను అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న కొందరు అడ్డుకున్నారు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ సందర్భంగా నల్ల సిరాను ఎమ్మెల్యేపై విసిరారు. ఈ దాడిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు చేతులు ఎత్తేశారు. అయితే ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. కేంద్ర మంత్రి సంజీవ్‌ బల్యాన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. 

అయితే ఈ దాడికి పాల్పడింది రైతులుగా బీజేపీ పేర్కొంది. సిసౌలి భారతీయ కిసాన్‌ సంఘం కీలక నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ గ్రామం. ఆ గ్రామం​ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి కేంద్రంగా మారింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఉమేశ్‌ మాలిక్‌ పర్యటించడం ఈ దాడికి కారణంగా మారింది. అయితే బీజేపీ నాయకులు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారని.. తమపై వారే దాడులు చేశారని రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇరు పక్షాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు.
 

మరిన్ని వార్తలు