కేరళ హైకోర్టు జడ్జి కారుపై ఆయిల్‌ పోసి నిరసన

3 Feb, 2021 18:51 IST|Sakshi

తిరువనంతపురం: కోర్టులో విచారణ ఆలస్యమవడం.. తీర్పు ఎంతకీ రాకపోవడంతో ఓ యువకుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా జడ్జి కారుపై ఆయిల్‌ వేసిన ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. హైకోర్టుకు వచ్చిన న్యాయమూర్తి కారుపై తీవ్ర నిరసనతో ఆయిల్‌ పోయడంతో తెల్లటి కారు నల్లగా మారింది. ఈ ఘటనతో వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. రెండేళ్ల కిందట ఇంటి నుంచి త‌ప్పిపోయిన జ‌స్నా మరియా అదృశ్యం కేసు హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే ఈ తీర్పు రోజురోజుకు ఆల‌స్యమవుతూ రెండేళ్లు గడవడంతో కొట్టాయం ప్రాంతానికి చెందిన ఓ యువ‌కుడు విసుగుచెందాడు.

దీంతో హైకోర్టు న్యాయ‌మూర్తి శిర్సి కారుపై వాహనాలకు వినియోగించే ఆయిల్ చల్లాడు. ఈ ఘటనతో షాక్‌కు గురయిన తోటి న్యాయమూర్తులు, న్యాయవాదులు వెంటనే అతడిని పట్టుకోవాలని ఆదేశించడంతో భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది. జ‌డ్జి సెక్యూరిటీ ఆఫీస‌ర్ నిందితుడిని ప‌ట్టుకుని సెంట్ర‌ల్ పోలీసుల‌కు అప్ప‌గించాడు. అయితే ఆ యువకుడు జ‌స్నా కేసును త్వ‌ర‌గా తేల్చాలంటూ కొన్ని రోజులుగా హైకోర్టు ముందు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాడు. ఆ నిరసనలో భాగంగా ఉద‌యం జ‌డ్జి శిర్సి కారు హైకోర్టు గేటు లోప‌లికి వస్తుండగా కారుపై ఆయిల్ గుప్పాడు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు