అదానీ వ్యవహారం: బెట్టు వీడని విపక్షాలు.. ప్రధాని స్పందనకై డిమాండ్‌

7 Feb, 2023 13:49 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: అదానీ గ్రూప్‌ వ్యవహారంపై పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరగకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయి. సహకరిస్తామని చెప్పడంతో.. మంగళవారం ఇరు సభలు సజావుగా జరుగుతాయని అంతా భావించారు. అయితే టర్కీ, సిరియా భూకంప బాధితుల సంతాపం ప్రకటన అనంతరం.. పార్లమెంటరీ సంయుక్త కమిటీ(జేపీసీ) వేయాలంటూ ఇరు సభలను అడ్డుకునే యత్నం చేశాయి. దీంతో ఉభయ సభలు కాసేపటికి వాయిదా పడ్డాయి. 

తొలుత బీఆర్‌ఎస్‌, ఆప్‌లు మాత్రమే సమావేశాలకు దూరంగా ఉంటాయని అంతా భావించారు. ఈ క్రమంలో మిగతా పార్టీలలో దాదాపుగా అన్నీ పార్లమెంట్‌ వ్యవహారాలకు సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ జైరామ్‌ రమేశ్‌ ప్రకటించారు. అయితే..   లోక్‌సభలో పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా రాజ్యసభలో మాత్రం విపక్షాలు కార్యకలాపాలను ఏమాత్రం ముందుకు కదలకుండా అడ్డుకున్నాయి. 

అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ హౌజ్‌ వెల్‌లోకి వెళ్లాయి. దీంతో రాజ్యసభ మధ్యాహ్నాం రెండు గంటల దాకా సభ వాయిదా పడింది. మరోవైపు లోక్‌సభ ప్రారంభంలో ప్రతిపక్షాల నిరసనతో మధ్యాహ్నం 12 గంటలకు, ఆపై మరోసారి మధ్యాహ్నం 1.30 నిమిషాలకు వాయిదా పడగా.. ఆ తర్వాత ప్రారంభమైన సభ కాస్త సజావుగానే నడిచింది. 

అదానీ గ్రూప్‌-హిండెన్‌బర్గ్‌ నివేదిక వ్యవహారంపై జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీ దర్యాప్తుగానీ,  సీజేఐ పర్యవేక్షణలో దర్యాప్తునకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రధాని మోదీ సైతం వివరణ ఇవ్వాలని పట్టుబడుతున్నాయి.

మరిన్ని వార్తలు