పబ్‌జీ బ్యాన్ : పబ్‌జీ కార్పొరేష‌న్ కీలక ప్రకటన

8 Sep, 2020 15:00 IST|Sakshi

టెన్సెంట్ గేమ్స్ తో సంబంధాలు తెగదెంపులు

పబ్‌జీ  నిర్వహణ మాదే

సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం పబ్‌జీ సహా 118 చైనా యాప్స్‌ని నిషేధంతో  ఆందళనలో పడిన పబ్‌జీ  ఫాన్స్ కు భారీ ఊరట లభించనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో  పాపులర్ బ్యాటిల్ రాయల్ గేమ్ పబ్‌జీ మొబైల్ మళ్లీ  దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి పరిణామాల దృష్ట్యా ప‌బ్‌జి మొబైల్‌, ప‌బ్‌జి మొబైల్ లైట్ గేమ్‌ల‌కు ప‌బ్లిషింగ్ హ‌క్కుల‌ను తామే  స్వయంగా పర్యవేక్షిస్తామని, ఇక‌పై చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ తో త‌మ‌కు ఎలాంటి సంబంధం ఉండ‌ద‌ని తేల్చి చెప్పింది.  (ఇండియన్ పబ్‌జీ...ఫౌజీ వచ్చేస్తోంది!)

ఇండియాలో పబ్‌జీ రద్దుపై ఈ గేమ్ రూపకర్త సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ పబ్‌జి కార్పొరేష‌న్  తాజాగా స్పందించింది. పబ్‌జీ మొబైల్ వర్షన్‌ను  ప్రమోట్ చేస్తున్న  చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ కంపెనీతో సంబంధాలను తెగ తెంపులు చేసుకుంటోంది. నిషేధం తదనంతర పరిస్థితిని గమనిస్తున్నామని వెల్లడించింది. ఇకపై పబ్‌జీ మొబైల్‌కు, టెన్సెంట్ గేమ్స్‌కు ఎలాంటి సంబంధం లేదని, పూర్తి బాధ్యతలు తమ ఆధ్వర్యంలోనే ఉంటాయని  పబ్‌జీ కార్పొరేషన్ స్పష్టం చేసింది.  

భారతీయ చట్టాలు, నిబంధనలను, ప్రభుత్వం  చర్యలను పూర్తిగా గౌరవిస్తున్నామనీ,  ఈ విషయంలో ఒక పరిష్కారం కోసం భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని భావిస్తున్నామని ప్రకటించింది. తద్వారా యాప్‌పై నిషేధం తొలగిపోతుందని పబ్‌జీ కార్పొరేషన్ భావిస్తోంది. అయితే ఈ విష‌యంపై కేంద్రం ఇంకా స్పందించాల్సి ఉంది.  కాగా గత వారం భారతదేశంలో పబ్‌జీ నిషేధం తరువాత టెన్సెంట్ మార్కెట్ విలువ 34 బిలియన్ డాలర్లను కోల్పోయినట్లు  అంచనా.

మరిన్ని వార్తలు