డాక్టర్‌పై కుమార్తె దాడి.. బహిరంగ క్షమాపణలు తెలిపిన ఆ రాష్ట్ర సీఎం

21 Aug, 2022 16:29 IST|Sakshi

ఐజ్వాల్‌: ముఖ్యమంత్రి కుమార్తె అంటే ఆ హోదానే వేరు. ఎక్కడికెళ్లినా సాదరంగా ఆహ్వానిస్తారు. ఆమె ఆదేశిస్తే చిటికేలో పని పూర్తవుతుంది. ఆమెకు కోపం వచ్చేలా ఎవరూ మసులుకోవాలనుకోరు. అలాంటిది ఓ డాక్టర్‌.. మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగా కుమార్తె ఆదేశాలను ధిక్కరించాడు. దీంతో ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. డాక్టర్‌పై ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో మిజోరాం ముఖ‍్యమంత్రి జోరంతంగా క్షమాపణలు చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు.

ఇంతకీ ఏం జరిగిందంటే?
మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగా కుమార్తె మిలారి చాంగ్టే.. రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌లోని ఓ డెర్మటాలజిస్ట్‌ వద్దకు గత బుధవారం వైద్య పరీక్షల కోసం వెళ్లారు. అయితే, అపాయింట్‌మెంట్‌ లేకుండా పరీక్షించేది లేదని ఆ డాక్టర్‌ తేల్చి చెప్పాడు. క్లినిక్‌ మూసివేసే లోపు అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలని మిలారి చాంగ్టేకు సూచించాడు. ఈ విషయం ఆమెకు కోపం తెప్పిచింది. నన్నే అపాయింట్‌మెంట్‌ తీసుకోమంటావా అని డాక్టర్‌పై దాడి చేశారు మిలారి. అక్కడున్న వారు ఆపేందుకు ప్రయత్నించినా డాక్టర్‌ ముఖంపై దాడి చేశారు.

ఈ దృశ్యాలు వైరల్‌గా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. మరోవైపు.. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ మిజోరాం విభాగం వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి శనివారం ఆందోళనకు దిగారు. దీంతో దిగొచ్చిన ముఖ్యమంత్రి జోరంతంగా.. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ద్వారా బహిరంగ క్షమాపణలు కోరారు. తాను స్వయంగా రాసిన క్షమాపణ పత్రాన్ని పోస్ట్‌ చేశారు. తన కుమార్తె అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: రోజువారీ కూలీకి రూ.37 లక్షల ఆదాయ పన్ను నోటీసులు

మరిన్ని వార్తలు