జన భాగస్వామ్యంతోనే జల సంరక్షణ

6 Jan, 2023 04:37 IST|Sakshi

ప్రజల్లో అవగాహన పెంచండి 

నీటి పంపకాలపై రాష్ట్రాలు దృష్టి పెట్టాలి 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు 

భోపాల్‌లో రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రుల తొలి జాతీయ సదస్సు   

న్యూఢిల్లీ: దేశంలో జల సంరక్షణ విషయంలో కేవలం ప్రభుత్వం తీసుకొనే చర్యలే సరిపోవని, ప్రజలందరి భాగసామ్యంతోనే అది సాధ్యమవుతుందని, ఆశించిన ఫలితాలు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జల సంరక్షణ ఉద్యమంతో అనుసంధానమైతేనే ప్రజలకు ఇందులోని తీవ్రత, ప్రాధాన్యం తెలుస్తుందని అన్నారు. కార్యక్రమ ఉద్దేశం అర్థమైతే వారు దాన్ని సొంతం చేసుకుంటారని తెలిపారు. గురువారం మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో నిర్వహించిన రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రుల తొలి జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, భాగస్వామ్యానికి నీరు ఒక కీలకాంశం కావాలని చెప్పారు. దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నీటి పంపకాలపై ముందుగానే దృష్టి పెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల మధ్య నడుమ దశాబ్దాలుగా జల వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

‘వాటర్‌ విజన్‌–2047’
మన రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం జలం అనేది రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. మనం నిర్దేశించుకున్న సమ్మిళిత లక్ష్యాల సాధనకు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే 25 ఏళ్లలో సాగించబోయే ‘అమృతకాల’ ప్రయాణంలో ‘వాటర్‌ విజన్‌–2047’ అనేది అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎక్కువ శాతం పనులు జల సంరక్షణ దిశగానే జరగాలని చెప్పారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు.

ప్రజలతోపాటు సామాజిక సంస్థలు, పౌర సంస్థలు సైతం జల సంరక్షణ ఉద్యమాల్లో పాలుపంచుకోవాలని కోరారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం అంటే దాని అర్థం ప్రభుత్వపరంగా పారదర్శకత తగ్గించడం కాదన్నారు. అలాగే మొత్తం బాధ్యతను ప్రజలపై మోపడం కాదని తేల్చిచెప్పారు. జల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడానికి స్థానికంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

ప్రతి జిల్లాలో అమృత సరోవరాలు  
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 75 అమృత సరోవరాలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్ర మోదీ తెలియజేశారు. ఇప్పటికే 25,000 సరోవరాలు నిర్మించినట్లు చెప్పారు. ప్రతి సరోవరం కనీసం ఎకరం వైశాల్యంలో ఉంటుందని, ఇందులో 10,000 క్యూబిక్‌ మీటర్ల నీటిని నిల్వ చేయొచ్చని అన్నారు. జల సంరక్షణకు జియో–సెన్సింగ్, జియో–మ్యాపింగ్‌ వంటి ఆధునిక టెక్నాలజీలు వాడుకోవాలని సూచించారు. టెక్నాలజీ–పరిశ్రమలు–స్టార్టప్‌లను అనుసంధాస్తే చక్కటి ఫలితాలు వస్తాయన్నారు.

నమామి గంగా మిషన్‌ తరహాలో నదుల ప్రక్షాళనకు రాష్ట్రాలు సైతం నడుం బిగించాలని ప్రధానమంత్రి విన్నవించారు. నదుల, జల వనరులను కాపాడుకోవాలన్నారు. ప్రతి రాష్ట్రంలో చెత్త నిర్మూలన, మురుగునీటి శుద్ధి కోసం నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. తాజా నీటిని సంరక్షించుకోవడం, మురుగునీటిని శుద్ధి చేసి మళ్లీ వాడుకోవడం పర్యావరణానికి చాలా మేలు చేస్తుందని వివరించారు. ‘ప్రైమ్‌ మినిస్టర్‌ అగ్రికల్చర్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌’ కింద 70 లక్షల హెక్టార్లకుపైగా భూమిని సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచ్చామని ప్రధాని మోదీ తెలిపారు.

మరిన్ని వార్తలు