‘సార్‌.. సార్‌..’ అంటున్నా ఆగలేదు

1 Sep, 2020 09:51 IST|Sakshi
టాయ్‌లెట్‌ క్లీన్‌ చేస్తున్న మల్లాది కృష్ణారావు

పుదుచ్చేరి: ఎవరి బాధ్యతను వారు విస్మరించినపుడు వేరొకరి చేత ఆ బాధ్యతను గుర్తు చేయించుకోవలసిన దుస్థితి వస్తుంది. గుర్తు చేసినా వాళ్లు ఆ బాధ్యతను చేతుల్లోకి తీసుకోక పోతుంటే?! మల్లాది కృష్ణారావు గారు ఏం చేశారో చూడండి. ఆయన మన తెలుగువారు. పుదుచ్చేరిలో కీలకమైన వ్యక్తిగా పెద్ద స్థానంలో ఉన్నారు. శనివారం ఆయన ఇన్‌స్పెక్షన్‌కి వెళ్లారు. కోవిడ్‌ ఇన్‌స్పెక్షన్‌. ఎక్కడంటే.. ‘ఇందిరాగాంధీ గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌’లో. పేషెంట్‌లను పలకరించారు. ఏ పడక దగ్గరకు వెళ్లినా ఒకటే కంప్లయింట్‌. ‘టాయిలెట్స్‌ శుభ్రంగా ఉండటం లేదు సర్‌’ అని. ఆసుపత్రి అధికారులను పిలిపించడం, వాళ్లు పరుగున రావడం ఏం లేదు. వాళ్లు ఆయన పక్కన లేకుంటే కదా! ‘ఏమిటిది?’ అన్నట్లు వాళ్ల వైపు చూశారు కృష్ణారావు. (శశికళకు షాక్‌ ఇచ్చిన ఐటీ?)

ఆ వెంటనే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. చట్టం అంటే.. చీపురు, నీళ్ల బకెట్, క్లీనింగ్‌ లిక్విడ్స్‌! నేరుగా అక్కడి ఒక టాయిలెట్‌ గదికి వెళ్లి క్లీన్‌ చెయ్యడం మొదలు పెట్టారు!! ‘సార్‌.. సార్‌..’ అంటున్నా ఆగలేదు. ఎవరి పని వారు చెయ్యకపోతుంటే ‘ఎందుకు చెయ్యరు?’ అని నిలదీసి చేయించడం ఒక పద్దతి. అయితే ఎంత నిలదీసినా కదలని ఉచ్ఛస్థితి లోకి వచ్చేసిన వాళ్లు ఉంటారు. వాళ్ల చేత ఐక్యరాజ్యసమితి కూడా పని చేయించలేదు. ఇక కృష్ణారావు గారెంత? ఆఫ్టాల్ర్‌ ఆరోగ్యశాఖ మంత్రి. శుభ్రతే దైవం అంటారు. వృత్తిని దైవంలా భావించని వారి కారణంగానే దైవానికి భూమి మీద శుభ్రమైన చోటు లేకుండా పోతోంది. (మహిళ మంటల్లో కాలుతున్నా పట్టించుకోకుండా..)

మరిన్ని వార్తలు