అమ్మా, నువ్వైనా మోదీకి చెప్పమ్మా..

24 Jan, 2021 17:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు. ఎవరి మాట విన్నావినిపించుకోకపోయినా అమ్మ మాట జవదాటడంటారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీకి నువ్వైనా చెప్పమ్మా అంటూ ఓ పంజాబ్‌ రైతు హర్‌ప్రీత్‌ సింగ్‌ తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చి మోదీ తల్లి హీరాబెన్‌కు హిందీలో లేఖ రాశాడు. "బరువెక్కిన హృదయంతో ఈ లేఖ రాస్తున్నా.. దేశానికి, ఈ ప్రపంచానికే అన్నం పెట్టే అన్నదాతలు కొద్దిరోజులుగా ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డు మీద నిద్రిస్తున్నారు. 95 ఏళ్ల ముసలివాళ్ల దగ్గర నుంచి, మహిళలు, చిన్నపిల్లల వరకు అంతా రోడ్డు మీద పడ్డారు. చలి వారి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది. మరికొందరి ప్రాణాలను కూడా బలి తీసుకుంటోంది. ఇది మాలో భయాందోళనలను కలిగిస్తోంది. పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీ ఇతర దిగ్గజాల ఆదేశాల మేరకు ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. ఇవి మా రైతులను తీవ్ర నిరాశకు గురి చేశాయి" (చదవండి: పంతం వీడండి)

"అందుకే ఆ బిల్లులకు వ్యతిరేకంగా మా రైతులు ఢిల్లీలో ప్రశాంతంగా ఆందోళనలు జరుపుతున్నారు. దేశంలోని రైతులు చట్టాల సవరణలు కోరడం లేదు, వాటిని రద్దు చేయాలని మాత్రమే అభ్యర్థిస్తున్నారు. ఎంతో ఆశతో ఈ లేఖ రాస్తున్నా. అమ్మ చెప్తే ఎవరూ కాదనరు. మన దేశంలో తల్లిని దైవంగా భావిస్తాం. అలాంటిది నువ్వు నీ కొడుకు మోదీకి మా విన్నపాన్ని చెవిన వేయు. మోదీ చెవి మెలిపెట్టి చట్టాలు రద్దు చేయమని ఆదేశించు. ఆయన నీ మాట కాదనరు. నీ ఆజ్ఞతో మోదీ వెంటనే రద్దుకు పూనుకుంటారని ఆశిస్తున్నాం. అదే జరిగితే యావత్తు దేశం నీకు రుణపడి ఉంటుంది. నూతన చట్టాలు రద్దయితే అది మొత్తం దేశానికే విజయం అవుతుందే తప్ప ఎవరూ ఓడినట్లు కాదు" అని రాసుకొచ్చాడు. కాగా నెలల తరబడి జరుగుతున్న రైతు ఆందోళనల్లో చురుకుగా పాల్గొంటున్న హర్‌ప్రీత్‌ సింగ్‌ను పోలీసులు కొద్దిరోజుల క్రితం అరెస్ట్‌ చేశారు. అనుమతి లేకుండా నిరసన తెలుపుతున్నావంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఓ రోజు తర్వాత అతడిని బెయిల్‌పై విడుదల చేశారు. (చదవండి: ‘వాయిదా’కు ఓకే అంటేనే చర్చలు)

మరిన్ని వార్తలు