మసూద్‌ అజర్‌తో పాటు సోదరుడి పేరు చేర్చిన ఎన్‌ఐఏ 

25 Aug, 2020 13:12 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ ప్రజలను తీవ్ర విచారంలోకి నెట్టడమే కాక పాక్‌, ఇండియా మధ్య యుద్ధ పరిస్థితులకు దారి తీసిన పుల్వామా దాడి కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) మంగళవారం చార్జిషీట్‌ దాఖలు చేసింది. జైషే మహ్మద్ చీఫ్, ఉగ్రవాది మసూద్ అజర్‌తో పాటు అతడి సోదరుడు రౌఫ్ అస్గర్ పేరును ఎన్‌ఐఏ ఈ చార్జిషీట్‌లో చేర్చింది. పుల్వామా దాడికి వీరిద్దరే ప్రధాన సూత్రధారులని ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో పేర్కొంది. 5,000 పేజీలతో కూడిన ఛార్జిషీట్‌ను ఎన్‌ఐఏ జమ్మూ కోర్టులో సమర్పించనుంది. ఈ దారుణమైన ఉగ్రదాడులకు ఎలాంటి ప్రణాళిక రచించారు.. పాక్‌ నుంచి ఎలా అమలు చేశారనే దాని గురించి అధికారులు చార్జిషీట్‌లో పూర్తిగా వివరించారు. అంతేకాకుండా జైషే మహ్మద్‌కు చెందిన 20 మంది ఉగ్రవాదులు ఈ దాడికి అవసరమైన ఆయుధాలను సమకూర్చారని ఛార్జిషీట్‌లో తెలిపారు. వీటన్నింటికీ అవసరమైన పూర్తి ఆధారాలను కూడా ఎన్‌ఐఏ బృందం కోర్టుకు సమర్పించనుంది. వాట్సాప్ చాటింగ్‌, ఫొటోలు, ఆర్డీఎక్స్‌ రవాణాకు సంబంధించిన ఫొటోలు, ఫోన్ కాల్స్ డేటా... ఇలా కీలక ఆధారాలను ఎన్‌ఐఏ అధికారులు కోర్టుకు నివేదించనున్నారు. (చదవండి: మళ్లీ ‘పూల్వామా’ దాడి జరిగితేనే బీజేపీ గెలుపు!)

భారత్‌ కశ్మీర్‌ను ఆక్రమించుకున్నందనే పాక్‌ ఈ దాడులకు తెగబడిందని ఎన్‌ఐఏ తెలిపింది. భారత్‌పై దాడికి పాక్,‌ స్థానికుడు ఆదిల్‌ అహ్మద్‌ దార్‌ను ఉపయోగించింది. అతడు సూసైడ్‌ బాంబర్‌గా మరి సీఆర్‌పీఎఫ్‌ దళాలు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ మీదకు పేలుడు పదార్థాలతో నిండిని కారును దూకించాడని అధికారులు తెలిపారు. ఇక పుల్వామా దాడిలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన దేశం పాత్రను ఖండించిన సంగతి తెలిసిందే. భారతదేశం సాక్ష్యాలు ఇస్తే నేరస్థులను విచారిస్తామని కూడా తెలిపారు. కానీ చర్యలు మాత్రం శూన్యం. పైగా అంతర్జాతీయ సమాజం నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నప్పటికి పాక్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు