కరోనా : పుణేలో రాత్రి కర్ఫ్యూ, థియేటర్ల మూత

2 Apr, 2021 14:16 IST|Sakshi

సాక్షి, ముంబై:  మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.  రోజు రోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  పుణే కీలక  నిర్ణయం తీసుకుంది. కరోనాను అదుపుచేసే చర్యల్లో భాగంగా పూణే డివిజనల్ కమిషనర్ సౌరభ్ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల పాటు కఠిన  నిబంధనలు అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. రేపటి నుంచి (శనివారం ఏప్రిల్‌ 3) ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని ఆయన తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీ నుండి పుణేలో సాయంత్రం 6 గంటలనుంచి ఉదయం 6 గంటల వరకు 12 గంటల రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. వచ్చే శుక్రవారం పరిస్థితిని సమీక్షించనున్నామని సౌరభ్ రావు వెల్లడించారు. 

 వారం రోజుల పాటు అమలయ్యే నిబంధనలు

  • బార్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు మూసివేత
  • హోం డెలివరీకి మాత్రమే అనుమతి
  • అంత్యక్రియలు ,  వివాహాలు మినహా బహిరంగ కార్యక్రమాలు అనుమతి లేదు
  • అంత్యక్రియల్లో గరిష్టంగా 20 మంది , వివాహాలలో 50 మంది పాల్గొనేందుకు మాత్రమే అనుమతి 
  • రాబోయే 7 రోజులు మతపరమైన అన్ని  ప్రదేశాలు మూత

రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న తరుణంలో లాక్‌డౌన్‌  తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు గత మార్చి నుండి అప్రమత్తంగా ఉండాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా, నిర్లక్ష్యంగానే ఉన్నారని ముంబై మేయర్ కిషోరి పడ్నేకర్ శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న కేసులతో, పడకలు, వెంటిలేటర్ల కొరత కూడా కనిపిస్తోందని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. ఈ క్రమంలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఈ రోజు రాత్రి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారని ఆమె ప్రకటించారు. దీంతో లాక్‌డౌన్‌ వార్తలకు మరింత బలం చేకూరింది.

కాగా, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నైట్‌ కర్ఫ్యూ విధించారు. నాందేడ్, బీడ్‌తోపాటు మరికొన్ని జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలవుతోంది. పలు జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్‌తోపాటు ఆంక్షలను మరింత కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రికి 8,011 కొత్త కరోనావైరస్ కేసులను  గుర్తించినట్టు పూణే అధికారులు ధృవీకరించారు. దీంతో మొత్తం కేసులు దాదాపు 5.5 లక్షలకు చేరాయి. 

మరిన్ని వార్తలు