అత్య‌ధిక కేసుల‌తో ..కరోనా హాట్‌స్పాట్‌గా పూణె

17 Aug, 2020 13:50 IST|Sakshi

ముంబై : దేశంలో అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న మ‌హారాష్ర్ట‌లో మ‌రో రికార్డు న‌మోదైంది. మ‌హారాష్ర్ట సాంస్కృతిక రాజ‌ధానిగా పేరొందిన పూణెలో క‌రోనా కేసులు ముంబైని దాటేశాయి. ఇప్ప‌టివ‌ర‌కు రాజ‌ధాని ప్రాంతం ముంబైలో అత్య‌ధిక కోవిడ్ కేసులు న‌మోదయ్యాయి.  ఆదివారం నాటి బులెటిన్ ప్రక‌రం ఇప్పుడు ఆ మార్క్‌ని పూణె అధిగమించింది. ఇప్ప‌టివ‌ర‌కు ముంబైలో 128,726 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, పూణెలో 130,606 కేసులు న‌మోద‌య్యాయి. యాక్టివ్ కేసుల విష‌యంలోనూ పూణె 41,020 కేసుల‌తో మొద‌టి స్థానంలో ఉండ‌గా, 17,825 కేసుల‌తో ముంబై రెండో  స్థానంలో ఉంది. ఇక  595,865  కోవిడ్ కేసుల‌తో మ‌హారాష్ర్ట  దక్షిణాఫ్రికాను అధిగమించింది.

క‌రోనా కేసుల విష‌యంలో 587,345 కేసుల‌తో ప్ర‌పంచంలో ద‌క్షిణాఫ్రికా ఐద‌వ స్థానంలో ఉంది. గ‌త నాలుగు రోజుల్లో మ‌హారాష్ర్ట‌లో 300 కంటే త‌క్కువ మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయ‌ని ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ర్టంలో కోవిడ్ కార‌ణంగా 20,037 మంది చ‌నిపోయారు.  మ‌ర‌ణాల రేటు  3.36 శాతంగా ఉండ‌గా రిక‌వ‌రీ రేటు 69.82 శాతం నుంచి  70 శాతానికి పెరిగిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.  రాష్ర్టంలో ఇప్ప‌టికే  417,123 మంది డిశ్చార్జ్ అవ‌గా, 158,395 యాక్టివ్ కేసులున్నాయి. (భారత్‌లో 26 లక్షల కేసులు, 50 వేల మరణాలు)


 

మరిన్ని వార్తలు