Punjab: పంజాబ్‌ ప్రజలకు ఆప్‌ సర్కార్‌ శుభవార్త..

16 Apr, 2022 11:24 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌లోని ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్తనందించింది. జూలై 1నుంచి ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు కరెంట్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పంజాబ్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం.. నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారీ ప్రకటన చేసింది. ఈనెల 16న పంజాబ్‌ ప్రజలకు శుభవార్త అందించనున్నట్లు సీఎం భగవంత్‌ మాన్‌ ఇటీవల  ప్రకటించారు

అదే విధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో సమావేశమమై దీనిపై చర్చించినట్లు సీఎం తెలిపారు. ‘‘ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం కోసం ఇప్పుడు మీరు అయిదేళ్లు వేచి ఉండాల్సిన అవసరం లేదు.. పంజాబ్ ప్రజలు రేపు పెద్ద ప్రకటన వినబోతున్నారు’’ అని ఆప్‌ ట్వీట్ చేసింది.  అయితే ఢిల్లీలోని ఆప్‌ సర్కార్‌ కూడా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ ఇస్తోంది.

కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆప్‌ ఇచ్చిన హామీల్లో.. ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు కూడా ఒకటి. అధికారంలోకి వచ్చిన నెలలోనే ఇచ్చిన హామీని నెలబెట్టుకుంది ఆప్‌ సర్కార్‌. ఇప్పటికే పంజాబ్ ప్ర‌భుత్వం రైతుల‌కు ఉచిత క‌రెంటు ఇస్తోంది. ఇటీవల జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆప్‌ 92  చోట్ల విజయకేతనాన్ని ఎగరవేసింది.
చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు

మరిన్ని వార్తలు