మిలిటరీ స్టేషన్‌లో బుల్లెట్‌ గాయంతో సైనికుడి మృతి

13 Apr, 2023 12:16 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌లోని బటిండా సైనిక స్థావరంలో బుధవారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. తాజాగా అదే ప్రాంతంలో ఓ ఆర్మీ సైనికుడు తుపాకీ కాల్పులతో మరణించాడు. కాల్పుల ఘటనలో ఫిరంగి విభాగానికి చెందిన నలుగురు సిబ్బంది మరణించిన 12 గంటల తర్వాత.. బుధవారం మధ్యాహ్నం ఈ జవాను మృతి చెందాడు. 

ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ.. "భటిండా మిలిటరీ స్టేషన్‌లో ఏప్రిల్ 12న సాయంత్రం 4:30 గంటలకు ఒక సైనికుడికి తుపాకీ గాయమైంది. అతను తన సేవా ఆయుధంతో సెంట్రీ డ్యూటీలో ఉండగా ఈ ఘటన చోటు  చేసుకుంది. సైనికుడిని వెంటనే మిలిటరీ ఆసుపత్రికి తరలించామని, అయితే అతను చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. అయితే, తాజా ఘటనకు అంతకుముందు జరిగిన కాల్పులతో ఎలాంటి సంబంధం లేదని అధికారలు పేర్కొన్నారు.

ఈ జవాను ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఏదైనా ప్రమాదం జరిగిందా..? అన్నదానిపై పూ​ర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో మరణించినట్లు ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు.  కాగా, తాజా ఘటనతో 24 గంటల వ్యవధిలోనే బఠిండా సైనిక స్థావరంలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు.

మరిన్ని వార్తలు