42 కార్లతో పంజాబ్‌ సీఎం కాన్వాయ్‌.. ‘వీఐపీ కల్చర్‌’ అంటూ విమర్శలు!

30 Sep, 2022 17:27 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌పై విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. రాష్ట్రంలో వీఐపీ సంస్కృతికి స్వస్తి పలుకుతానని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని సీఎం విస్మరించారని ఆరోపించాయి. గత ముఖ్యమంత్రులతో పోలిస్తే ఎక్కువ కార్లు తన కాన్వాయ్‌లో ఉనియోగిస్తున్నట్లు సమాచార హక్కు దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఈ క్రమంలో గత ముగ్గురు సీఎంలను మించి కార్లు వినియోగిస్తున్నారని, ఇది వీఐపీ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నాయి. సామాన్యుడి ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నించారు కాంగ్రెస్‌ నేత ప్రతాప్‌ సింగ్‌ బజ్వా. ఆయన ఆర్‌టీఐ ద్వారా దరఖాస్తు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

‘షాకింగ్‌ విషయం.. 2007-17 వరకు సీఎం బాదల్‌ 33 వాహనాలను ఉపయోగించారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ఆదే కొనసాగించారు. కానీ, ఆర్‌టీఐ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే.. సీఎం భగవంత్‌ మాన్‌ తన కాన్వాయ్‌లో 42 కార్లు ఉపయోగిస్తున్నారు.’ అని పేర్కొన్నారు పంజాబ్‌ అసెంబ్లీలో విపక్ష నేత ప్రతాప్‌ సింగ్‌. సెప్టెంబర్‌ 20, 2021 నుంచి మార్చి 16, 2022 వరకు సీఎంగా చేసిన చరణ్ జీత్‌ సింగ్‌ చన్నీ కెప్టెన్‌తో పోలీస్తే మరో ఆరు కార్లు ఎక్కువగా ఉనియోగించినట్లు చెప్పారు. భారీ స్థాయిలో కాన్వాయ్‌ని ఉపయోగించి పంజాబ్‌ ప్రజలకు సీఎ మాన్‌ ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజల డబ్బును నిర్లక్ష్యంగా ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో భారీ కాన్వాయ్‌ని ఎలా ఉపయోగిస్తారు? అంటూ దుయ్యబట్టారు. అయితే.. ఈ విషయంపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదు ఆమ్‌ ఆద్మీ పార్టీ.

ఇదీ చదవండి: పొలిటికల్‌ ట్విస్ట్‌.. ఆ ఆటోవాలాకు డబ్బులిచ్చి ప్రలోభ పెట్టారు?

మరిన్ని వార్తలు