బీజేపీ వాకౌట్‌.. కాంగ్రెస్‌ రచ్చ.. పంజాబ్‌ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం

27 Sep, 2022 14:40 IST|Sakshi

ఛండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీలో ఇవాళ(మంగళవారం) కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని సర్కార్‌ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్‌ సభ్యుల గోల నడుమ, బీజేపీ సభ్యుల వాకౌట్‌ నిరసనల మధ్య తీర్మానం ప్రవేశపెట్టారాయన.

స్పీకర్‌ కుల్టార్‌సింగ్‌ సంధ్‌వాన్‌ అసెంబ్లీలో మాన్‌ ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మాన ప్రకటన చేయడంతో.. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. విశ్వాస పరీక్ష, ఇతర పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను అక్టోబర్‌ 3వ తేదీ వరకు పొడిగించాలని బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ(బీఏసీ)లో నిర్ణయించినట్లు స్పీకర్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు.

ఇదిలా ఉంటే.. సెప్టెంబర్‌ 22వ తేదీనే ప్రత్యేక సమావేశాల కోసం ఆప్‌ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే.. కేవలం విశ్వాస తీర్మానం కోసమని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ అందుకు అంగీకరించలేదు. సభ నిబంధనలు అందుకు అంగీకరించవని బీజేపీ, కాంగ్రెస్‌ గవర్నర్‌ను కోరడంతో.. ఆయన న్యాయ అభిప్రాయం తీసుకున్నారు. ఈలోపు ఆప్‌ ప్రభుత్వం గవర్నర్‌ నిర్ణయంపై, కేంద్రంలోని బీజేపీపై విరుచుకుపడింది. మరోవైపు బీజేపీతో పాటు కాంగ్రెస్‌ సైతం గవర్నర్‌ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే.. 

విశ్వాస తీర్మానంతో పాటు సభలో చర్చించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని ప్రభుత్వం నివేదించడంతో.. గవర్నర్‌ సెప్టెంబర్‌ 27(ఇవాళ) నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చారు. 

ఇదిలా ఉంటే.. బీజేపీ తమ పార్టీలోని కనీసం పది మంది ఎమ్మెల్యేలను బీజేపీ పాతిక కోట్ల చొప్పున ఒక్కొక్కరికి ఇచ్చి పార్టీ మార్పించేందుకు ప్రయత్నించిందని, ఆపరేషన్‌ లోటస్‌ను తాము భగ్నం చేశామంటూ ఆప్‌ ప్రకటించుకుంది. ఈ క్రమంలోనే బలనిరూపణకు సిద్ధపడింది కూడా. అయితే పంజాబ్‌ బీజేపీ మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. ఆరు నెలల ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నాటకాలాడుతోందని విమర్శించింది బీజేపీ. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీపై ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలతో ఈమధ్యే బలనిరూపణలో నెగ్గింది కేజ్రీవాల్‌ ప్రభుత్వం.

ఇదీ చదవండి: పాస్‌పోర్ట్‌ కోసం... ఆన్‌లైన్‌లోనే పీసీసీ దరఖాస్తు

మరిన్ని వార్తలు