Punjab CM On Security For VIPs: పంజాబ్‌ ముఖ్యమంత్రి మరో సంచలన నిర్ణయం..

28 May, 2022 17:49 IST|Sakshi

చండీగఢ్‌: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరోగ్యశాఖ మంత్రిని పదవి నుంచి బర్తరఫ్‌ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 424 మంది ప్రముఖులకు సెక్యురిటీ రద్దు చేశారు. ప్రముఖులకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంటున్నట్టు శనివారం సంచలన ప్రకటన చేశారు. గత నెలలో కూడా 184 మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేటాయించిన భద్రతను రద్దు చేస్తూ భగవంత్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

వాళ్ల అవసరం లేదు..
రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఉపసంహరించిన వారిలో అకాల్‌ తక్త్‌ జాటేదార్‌గా వ్యవహరిస్తున్న జ్ఞాని హర్‌ప్రీత్‌ సింగ్‌ కూడా ఉన్నారు. ఆయనకు ఇదివరకు 6 మంది అంగరక్షకులు ఉండగా.. సీఎం నిర్ణయంతో ముగ్గురు సేవల నుంచి వెనుదిరిగారు. ఈ విషయమై హర్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయంతో తనకు ఇబ్బందేమీ లేదని అన్నారు. మిగతా ముగ్గురిని కూడా వెనక్కి పంపిస్తానని చెప్పారు. 

తనకు రక్షణ కల్పించేందుకు పంజాబ్‌ యువకులు చాలునని స్పష్టం చేశారు. మరోవైపు హర్‌ప్రీత్‌ సింగ్‌ సెక్యురిటీ ఉపసంహరణపై విమర్శల నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. వెనక్కి పిలిచిన ముగ్గురు బాడీ గార్డులను తిప్పి పంపిస్తామని తెలిపింది. అయితే, దీనిని హర్‌ప్రీత్‌ సింగ్‌ తిరస్కరించినట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు