రైతుల నిరసనలపై పంజాబ్‌ సీఎం కీలక వ్యాఖ్యలు

30 Jan, 2021 13:01 IST|Sakshi

చండీగఢ్‌: రైతు ఆందోళనల నేపథ్యంలో పాకిస్తాన్‌ దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉందని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అన్నారు. చైనాతో కలిసి దాయాది దేశం, భారత్‌లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని, కాబట్టి అనుక్షణం జాగ్రత్తగా ఉండాలని కేంద్రాన్ని అప్రమత్తం చేశారు. రైతు నిరసనలు మొదలైన నాటి నుంచి పాకిస్తాన్‌ నుంచి దేశంలోకి పెద్ద మొత్తంలో  ఆయుధాలు, డబ్బు, హెరాయిన్‌ వంటివి డ్రోన్ల ద్వారా డెలివరీ అవుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నదాతల ఆందోళనలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాక్‌ స్లీపర్‌ సెల్స్‌ ప్రస్తుతం పూర్తిగా యాక్టివ్‌ అయ్యాయయని, చొరబాటుకు యత్నించే అవకాశం ఉందని అమరీందర్‌ పేర్కొన్నారు. (చదవండి: ఢిల్లీ పేలుడు : ఉగ్రదాడి కావచ్చు)

కాగా ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. రైతులు గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 26న ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా పోలీసులు, రైతుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ నేపథ్యంలో అమరీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ... ‘‘ఇలాంటి ఘటనల్లో తప్పెవరిది అనేది కచ్చితంగా చెప్పలేం. దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. నిజానికి ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచే పాక్‌ వైపు నుంచి డ్రోన్‌ డెలివరీ ఎందుకు జరుగుతోంది? డబ్బు, ఆయుధాలు, హెరాయిన్‌ ఎందుకు ఇక్కడకు వస్తోంది? అన్న ప్రశ్నలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దాదాపు 30 డ్రోన్లను మేం గుర్తించాం. ఈ విషయాల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి కూడా తీసుకువెళ్లాను’’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు