పిలవకుండానే పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించిన సీఎం

27 Sep, 2021 15:03 IST|Sakshi

చండీగఢ్‌: సాధారణంగా ముఖ్యమంత్రి అంటే.. కట్టుదిట్టమైన భద్రత.. ఆయన చుట్టుపక్కల ఒక పెద్ద హడావిడితో కూడిన వాతావరణం ఉంటుంది. సీఎం చుట్టు ఉండే భద్రత సిబ్బంది.. ఆయన అపాయింట్‌ మెంట్‌ లేకుండా ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లనివ్వరనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో..  ఒక్కొసారి ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా సీఎం భద్రత దృష్ట్యా.. సెక్యురిటీ సిబ్బంది నుంచి చేదు అనుభవం ఎదుర్కోవడం మనం చూస్తునే ఉంటాం.

కొంత మంది ముఖ్యమంత్రులు మాత్రం దీనికి భిన్నంగా అవకాశం చిక్కినప్పుడల్లా ప్రజలతో మమేకమవ్వటానికి ప్రయత్నిస్తుంటారు. ప్రజలు జరుపుకునే పండుగలకు, శుభకార్యాలకు హజరవుతుంటారు. ఆ కోవకు చెందిన వారే ఇటీవల పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చరణ్‌ జీత్‌ సింగ్‌ ఛన్నీ. ఆయన తాజాగా ఒక వివాహ వేడుకలో వధువరులను ఆశీర్వదించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇటీవల పంజాబ్‌ 16 వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ బటిండా జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన.. తన కాన్వాయ్‌ రోడ్డు మండి కలాన్‌ అనే గ్రామంనుంచి వెళ్తుండగా.. ఒక వివాహ వేడుక జరుగుతోంది. వెంటనే సీఎం తన కాన్వాయ్‌ని ఆపించారు. ఆ తర్వాత కిందకు దిగి .. నూతన దంపతులను పలకరించారు. పెళ్లికుమారుడిని హత్తుకొని మరీ శుభాకాంక్షలు తెలియజేశారు.

అంతేకాకుండా ఆ వేడుకలో పెళ్లివారు ఇచ్చిన స్వీట్‌(పారట్‌) స్వీకరించి వారిని ఆనందపర్చారు. కాగా, సాక్ష్యాత్తూ.. ఒక సీఎం పిలవకుండా ఆగి..  తమకు శుభాకాంక్షలు తెలిపినందుకు వధువరులు ఆనందంతో ఉప్పోంగిపోయారు. వారితో సీఎం కొద్దిసేపు మాట్లాడారు. 

వధువరులను సీఎం చరణ్‌ జీత్‌ సింగ్‌ మనసారా ఆశీర్వదించారు. కాగా, దీన్ని పంజాబ్‌ ముఖ్యమంత్రి అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఈ వీడియో షేర్‌ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. అయితే, గతంలో  చరణ్‌ జీత్‌ సింగ్‌ విద్యార్థులతో కలిసి కపూర్తలాలో చేసిన భాంగ్రా ఫోక్‌  డ్యాన్స్‌ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

చదవండి: Charanjit Singh Channi: భాంగ్రా డ్యాన్స్‌తో హల్‌చల్‌

మరిన్ని వార్తలు