Sadhu Singh Dharamsot: పంజాబ్‌ మాజీ మంత్రి అరెస్ట్‌, నెల క్రితమే సీఎం వార్నింగ్‌

7 Jun, 2022 12:24 IST|Sakshi

చండీఘడ్‌:  అవినీతి ఆరోపణలపై పంజాబ్‌ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత సాధు సింగ్‌ ధరమ్‌సోత్‌ అరెస్టయ్యారు. మంగళవారం తెల్లవారుజామున రాష్ట్ర విజిలెన్స్‌ బ్యూరో ధరమ్‌సోతను అరెస్ట్‌ చేసింది. అతనితో పాటు సహాయకుడిగా పనిచేస్తున్న కమల్‌జిత్ సింగ్ అనే స్థానిక జర్నలిస్టును కూడా అరెస్టు చేశారు.  కాగా సాధు సింగ్‌ గతంలో కెప్టెన్‌ అమరీందర్‌ సింఘ్‌ కేబినెట్‌లో అటవీ, సాంఘిక, సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు.

అయితే పంజాబ్‌లో అటవీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చెట్లను నరికివేయడానికి అనుమతి ఇచ్చినందుకు లంచం తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల కోసం చెట్లు నరికినప్పుడు కాంట్రాక్టర్లు చెట్టుకు రూ.500 చొప్పున లంచం తీసుకున్నారని విజిలెన్స్ అధికారులు అభియోగాలు మోపారు. అలాగే దళితుల స్కాలర్‌షిప్ పథకాల్లో కోట్లాది రూపాయల కుంభకోణానికి సూత్రధారిగా ఉన్నట్లు సాధు సింగ్‌పై ఆరోపణలు వచ్చాయి.

కాగా కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రిపై చర్యలు తీసుకుంటామని ఆప్ నాయ‌కుడు, పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్‌సింగ్ హెచ్చరించిన నెల రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇక గ‌త‌వారం అవినీతికి పాల్ప‌డిన ఆరోప‌ణ‌ల‌పై క్యాబినెట్ మంత్రి విజ‌య్ సింగ్లా అరెస్టు అయిన సంగ‌తి తెలిసిందే. టెండర్లపై ఒక శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నాడని ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అతన్ని అరెస్టు చేసింది.
చదవండి: ఇంటిముందున్న పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్‌

మరిన్ని వార్తలు