కొనసాగుతున్న రైతుల రైల్‌రోకో

27 Sep, 2020 02:57 IST|Sakshi
పంజాబ్‌లోని పాటియాలాలో రైలుపట్టాలపై కూర్చొని నిరసన తెలుపుతున్న మహిళా రైతులు

చండీగఢ్‌ : పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా పంజాబ్‌లో రైల్‌ రోకో ఆందోళన కొనసాగుతోంది. గత మూడు రోజులుగా రైతులు రైలు పట్టాలపై కూర్చొని రైల్‌ రోకోలు నిర్వహిస్తున్నారు. తొలుత కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్‌‡్ష కమిటీ ఈ నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే, ఆ తర్వాత వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. అమృత్‌సర్‌లో అన్నదాతలు చొక్కాలు విప్పి బిల్లులపై తమ నిరసనను తీవ్రంగా వ్యక్తం చేశారు. చొక్కాలు విప్పి రైలు పట్టాలపై కూర్చుంటే అయినా కేంద్రం తమ గోడు వింటుందని కిసాన్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి శర్వణ్‌ సింగ్‌ పాంధేర్‌ అన్నారు. రైతుల నిరసనలతో రైల్వే అధికారులు మరో మూడు రోజులు రాష్ట్రంలో అన్ని పాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు.

రైతులకి మద్దతుగా రండి: రాహుల్‌ పిలుపు
కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా వేదికగా శనివారం స్పీక్‌ అప్‌ ఫర్‌ ఫార్మర్స్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మోదీ ప్రభుత్వం రైతుల్ని అమాయకుల్ని చేసి దోపిడీ చేస్తోందని వారికి మద్దతుగా ప్రజలందరూ గళమెత్తాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడానికే వ్యవసాయ బిల్లుల్ని ఆమోదించారని ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు