ఫిరోజ్‌పూర్‌ ఎస్‌ఎస్‌పీపై బదిలీ వేటు

9 Jan, 2022 05:25 IST|Sakshi
హర్‌మన్‌దీప్‌ సింగ్‌ (ఫైల్‌)

చండీగఢ్‌: పంజాబ్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కాన్వాయ్‌ను అడ్డుకుని రైతులు ఆకస్మికంగా ఆందోళనకు దిగడం, ఫ్లై ఓవర్‌ మీదనే ప్రధాని ఆగాల్సిరావడం వంటి భద్రతా వైఫల్య ఘటనలపై పంజాబ్‌ రాష్ట్ర సర్కార్‌.. పోలీస్‌ అధికారులపై బదిలీ వేటు వేసింది. ప్రధానికి సరైన భద్రత కల్పించడంలో విఫలమయ్యారనే ఆరోపణలపై ఐపీఎస్‌ అధికారులను బదిలీచేశారు.

బుధవారం రోజు ఘటన జరిగిన ఫిరోజ్‌పూర్‌ పోలీస్‌ పరిధి బాధ్యతలు చూసిన ఫిరోజ్‌పూర్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(ఎస్‌ఎస్‌పీ), ఐపీఎస్‌ అధికారి హర్‌మన్‌దీప్‌ సింగ్‌ హాన్స్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేశారు. హర్‌మన్‌దీప్‌ను లూథియానాలోని ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్‌(ఐఆర్‌బీ) మూడో కమాండెంట్‌గా బదిలీచేశారు. ఈయన స్థానంలో ఫిరోజ్‌పూర్‌ ఎస్‌ఎస్‌పీగా నరీందర్‌ భార్గవ్‌ను నియమించారు. నౌనిహాల్‌ సింగ్, ఏకే మిట్టల్, సుఖ్‌చయిన్‌ సింగ్, నానక్‌ సింగ్, అల్కా మీనాలను బదిలీచేశారు. పీపీఎస్‌ అధికారులు హర్‌కమల్‌ప్రీత్‌ సింగ్, కుల్‌జీత్‌ సింగ్‌లనూ మరో చోటుకు బదిలీచేశారు.  

తప్పంతా ఫిరోజ్‌పూర్‌ ఎస్‌ఎస్‌పీదే..
జాతీయ స్మారక స్తూపం వద్ద నివాళులర్పించేందుకు హుస్సైనీవాలాకు బయల్దేరిన ప్రధాని మోదీని మార్గమధ్యంలో రైతులు అడ్డుకున్న ఉదంతంపై కేంద్ర హోం శాఖకు పంజాబ్‌ సర్కార్‌ ఒక నివేదికను సమర్పించింది. జనవరి ఐదు నాటి ఘటనలో వివరణ ఇవ్వాలని బటిందా ఎస్‌ఎస్‌పీ అజయ్‌ మలూజాను కేంద్ర హోం శాఖ వివరణ కోరుతూ షోకాజ్‌ నోటీసు శుక్రవారం పంపిన విషయం తెల్సిందే. దానిపై మలూజా ఇచ్చిన వివరణ.. హోం శాఖకు పంపిన నివేదికలో ఉంది. ఆ నివేదికలోని వివరాలు కొన్ని బహిర్గతమయ్యాయి.

ఫిరోజ్‌పూర్‌ ఎస్‌ఎస్‌పీ హర్‌మణ్‌ చేసిన తప్పు వల్లే మోదీకి భద్రత కల్పన విఫలమైందని మలూజా ఆరోపించారు. హుస్సైనీవాలాకు వెళ్లే మార్గంలో బటిందా పరిధిలోని తమ పరిధి వరకూ మోదీకి రక్షణ కల్పించామని, ఫిరోజ్‌పూర్‌ పరిధిలోకి కాన్వాయ్‌ వచ్చాకే ఈ ఘటన జరిగిందని మలూజా వివరణ ఇచ్చారు. ప్రధాని రాకకు ముందు జరిగిన ఘటనలు మొదలుకుని, రైతుల ఆందోళన, ప్రధాని బహిరంగ సభకు వెళ్లకుండా వెనుతిరగడం వరకు జరిగిన ఘటనలు, వాటి పర్యవసానాలను పంజాబ్‌ ప్రభుత్వం క్రమపద్ధతిలో నివేదించింది. రైతుల ఆందోళన అనేది ముందస్తు వ్యూహం కాదని, హఠాత్పరిణామం అని నివేదిక పేర్కొంది.

మరిన్ని వార్తలు