Jail Authority Branded 'Terrorist': జైలు అధికారి దారుణం.. ఇనుప చువ్వ కాల్చి ఖైదీ వీపుపై ‘ఆత్వాది’ అని..

4 Nov, 2021 20:47 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌లోని బర్నాల జిల్లా జైలు అధికారి ఓ ఖైదీ పట్ల వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. జైలులో కనీస హక్కులకోసం ఎదురు తిరిగిన కరమ్‌జిత్‌ సింగ్‌ (28) అనే ఖైదీపై జైలు సూపరింటెండెంట్‌ బల్బీర్‌ సింగ్‌ అమానుష చర్యకు పాల్పడ్డారు. అతని వీపుపై ‘ఆత్వాది’ (పంబాబీలో టెర్రరిస్టు) అనే అక్షరాలను ఇనుప చువ్వను కాల్చి వాతలు పెట్టి చెక్కారు.

డజనుకుపైగా కేసుల్లో దోషిగా తేలిన బాలామ్‌ఘర్‌కు చెందిన కరమ్‌జిత్‌ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా డ్రగ్స్‌ కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు జరిగినప్పుడు అతను తన గోడును వెళ్లబోసుకున్నాడు. జైలు సూపరింటెండెంట్‌ బల్బీర్‌ సింగ్‌ తనపై విచక్షణా రహితంగా దాడి చేసి.. ఒంటిపై ‘ఆత్వాది’ అని ఇనుప చువ్వతో కాల్చాడని కోర్టు దృష్టికి తేవడంతో విషయం వెలుగుచూసింది. 
(చదవండి: CID Show: సీఐడీ షో స్ఫూర్తి: దారుణానికి పాల్పడ్డ మైనర్లు)

అయితే, ఈ ఆరోపణలను జైలు సూపరింటెండెంట్‌ తోసిపుచ్చారు. కరమ్‌జిత్‌ తరచూ నేరాలు చేసి జైలుకొస్తాడని, సానుభూతి కోసం కట్టు కథలు చెబుతాడని అన్నారు. ఇక ఈ విషయంపై పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌జిందర్‌ రణ్‌ధావా విచారణకు ఆదేశించారు. ఫిరోజ్‌పూర్‌ డీఐజీ తేజింద్‌ సింగ్‌ మౌర్‌ను విచారణ అధికారిగా నియమించారు. 

మరోవైపు సిక్కులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఘటనకు బాధ్యుడైన జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేయాలని అకాలీదళ్‌ అధికార ప్రతినిధి మన్‌జిందర్‌ సింగ్‌ సిర్సా డిమాండ్‌ చేశారు. 
(చదవండి: పండుగ పూట విషాదం: కల్తీ మద్యం తాగి 10 మంది మృతి.. మరో 14 మంది..)

మరిన్ని వార్తలు