పనిచేయని పీఎం కేర్‌ వెంటిలేటర్లు: ఆస్పత్రుల్లో వృథాగా

12 May, 2021 14:09 IST|Sakshi

చండీఘడ్‌: కరోనా బాధితుల కోసం ప్రధానమంత్రి కేర్‌ నిధుల నుంచి తీసుకొచ్చిన వెంటిలేటర్లు వృథాగా పడి ఉన్నాయి. అవి సక్రమంగా పని చేయడం లేదని మూలకు పడేశారు. దీంతో పీఎం కేర్‌ నిధుల నుంచి తీసుకొచ్చిన వెంటిలేటర్లపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాసిరకం వెంటిలేటర్లు ఇస్తే ఏం ప్రయోజనమని మండిపడ్డారు. 

పీఎం కేర్‌ నిధుల నుంచి అగ్వా హెల్త్‌ కేర్‌ కార్యక్రమంలో భాగంగా పంజాబ్‌ రాష్ట్రానికి గతేడాది 250 వెంటిలేటర్స్‌ పంపించారు. వాటిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. అయితే పంపించిన వాటిలో చాలా వరకు పని చేయడం లేదని పక్కకు పడేశారు. గురు గోబింద్‌ సింగ్‌ వైద్య కళాశాల, ఆస్పత్రికి 80 వెంటిలేటర్స్‌ పంపించాల్సి ఉండగా 71 పంపారు. ఆ పంపిన వాటిలో ఒక్కటీ కూడా పని చేయడం లేదని ఆ కళాశాల వీసీ ఆరోపించారు. గంటా రెండు గంటలు పని చేయగానే మొరాయిస్తాయని తెలిపారు. దీంతో వాటిని పక్కన పడేసినట్లు తెలిపారు. 

పంపిన వెంటిలేటర్లు నాసిరకమైనవని.. అవి కొంత సేపు పని చేసి ఆగిపోతున్నాయని పలు ఆస్పత్రులు ఫిర్యాదు చేశాయి. నాణ్యమైన వెంటిలేటర్లు పంపలేదని అనస్థిషియా వైద్యులు చెబుతున్నారు. తరచూ మొరాయిస్తున్నాయని అని బాబా ఫరీద్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ రాజ్‌ బహదూర్‌ వాపోయారు. ‘82 వెంటిలేటర్లు ఇవ్వగా వాటిలో 62 పని చేయడం లేదని ఫొటోతో సహా తెలిపారు. అవి తీసుకు వచ్చినప్పటి నుంచి పని చేయడం లేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో 42 వెంటిలేటర్లతో రోగులకు సేవలు అందిస్తున్నాం. రోగులకు వాటిని అందుబాటులో ఉంచలేం’ అని పేర్కొన్నారు. 
 

ఇదే విషయాన్ని పంజాబ్‌ ఆప్‌ ఎమ్మెల్యే కుల్తార్‌ సింగ్‌ సంద్వాన్‌ ట్వీట్‌ చేశారు. ఆ వెంటిలేటర్ల దుస్థితిని ఫొటో పంచుకున్నారు. ఫరీద్‌కోట్‌లోని ఆస్పత్రిలో నిరుపయోగంగా వెంటిలేటర్లు పడి ఉన్నాయి. కరోనా రోగుల కోసం వాటిని వినియోగించేలా చర్యలు తీసుకోండి.’ అని కుల్తార్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా పంజాబ్‌ ముఖ్యమంత్రికి ట్యాగ్‌ చేశారు.

ఈ విమర్శలు రావడంతో వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్లను మరమ్మతు చేసేందుకు మెకానిక్‌లను పంపించింది. ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు ప్రస్తుతం ఎంతో అవసరం కావడంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద వాటిని బాగు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇవి పని చేస్తాయో.. లేదా మళ్లీ కొన్నాళ్లకు మొరాయిస్తాయోనని ప్రతిపక్షాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.

చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ
చదవండి: ఆవు పేడతో కరోనా అస్సలు తగ్గదు.. వేరే సమస్యలు వస్తాయి

మరిన్ని వార్తలు