Daggubati Purandeswari: దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ హైకమాండ్‌ గట్టి షాక్‌..

10 Sep, 2022 08:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ హైకమాండ్‌ గట్టి షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే ఒడిశా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ బాధ్యతల్లో కోతలు విధించగా తాజాగా ఛత్తీస్‌గఢ్‌ బాధ్యతల నుంచి పురందేశ్వరిని పూర్తిగా తప్పించారు. 2020 నవంబర్‌ నుంచి ఆమె ఛత్తీస్‌గఢ్, ఒడిశా బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. పురందేశ్వరి స్థానంలో రాజస్థాన్‌కు చెందిన కీలక నాయకుడు ఓం మాథుర్‌ను ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తాజాగా అక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఇన్‌చార్జ్‌ను మారుస్తూ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంది.
చదవండి: బీజేపీ బిగ్‌ ప్లాన్‌.. ప్రత్యర్థులకు అంతుచిక్కని ఎత్తుగడలు!

యూపీ విజయంలో కీలక పాత్ర
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలకు అత్యంత సన్నిహితుడిగా భావించే ఓం మాథుర్‌ గతంలో గుజరాత్‌ ఇన్‌చార్జ్‌గా, గతేడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. యూపీ విజయంలో మాథుర్‌ తనదైన శైలిలో కీలక పాత్ర పోషించారు. ఏడాదిన్నరగా పురందేశ్వరి అంచనాలకు తగ్గట్లుగా పార్టీ బలోపేతానికి కృషి చేయని కారణంగానే ఆమెను తప్పించారనే చర్చ జరుగుతోంది.

గెలుపే లక్ష్యంగా మార్పు..
వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ క్షేత్రస్థాయిలో భారీ మార్పులు చేపట్టింది. అందులో భాగంగా 15 రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌లుగా బలమైన నేతలకు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా వచ్చే ఏడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఛత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్‌ను గద్దె దింపేందుకు బీజేపీ సన్నద్ధమైంది.

ఒడిశా ఇన్‌చార్జ్‌గా ఉన్న పురందేశ్వరి బాధ్యతల్లో హై కమాండ్‌ కోత విధించింది. అంతేకాకుండా ఛత్తీస్‌గఢ్‌కు మరో ఇన్‌చార్జ్‌గా జాతీయ ప్రధాన కార్యదర్శి, అమిత్‌ షాకి సన్నిహితుడైన సునీల్‌ బన్సల్‌ను నియమించింది. బన్సల్‌ రంగంలోకి దిగడంతో పురందేశ్వరి పాత్ర నామమాత్రమే అనే చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకొనే అవకాశాలున్నాయని కీలక నేత ఒకరు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు