భార్య పాతివ్రత్య నిరూపణకు అగ్ని పరీక్ష!

23 Feb, 2021 16:36 IST|Sakshi

సలసల కాగే నూనెలో చేతులు పెట్టించిన దుర్మార్గుడు

భార్యపై నమ్మకం లేని ప్రబుద్ధుడు

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో ఘటన

ఉస్మానాబాద్‌: మహారాష్ట్రలో అమానుష ఘటన జరిగింది. నేటి ఆధునిక కాలంలోనూ భార్యను అనుమానిస్తూ శీల పరీక్ష చేశాడు. పురాణాల్లో అగ్ని పరీక్ష చేయగా నేడు భర్త సలసల కాగే నూనెలో చేతులు పెట్టించి ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించాడు. ఈ ఘోర ఘటన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లా పరాండలోని కచాపురి చౌక్‌లో జరిగింది. అయితే భార్యకు పరీక్ష చేస్తూ దాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పంచుకోవడం తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.

ఫిబ్రవరి 11వ తేదీన భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భర్తపై కోపంతో భార్య ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లింది. నాలుగు రోజుల పాటు కారు డ్రైవరైన ఆ భర్త ఆమె కోసం గాలించాడు. ఎంతకీ భార్య ఆచూకీ లభించలేదు. ఐదో రోజు భార్య ఫోన్‌ చేసి ఇంటికి వచ్చింది. అయితే ఇంటికొచ్చిన భార్యను ఎక్కడకు వెళ్లావని భర్త ప్రశ్నించగా.. ఆ నాలుగు రోజులు ఏం జరిగిందో చెప్పింది.

గొడవపడిన రోజు కచాపురి చౌక్‌లో బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి తనను బలవంతంగా తీసుకెళ్లిపోయారని భార్య చెప్పింది. తీసుకెళ్లిన వారు నాలుగు రోజులు తమ వద్దే ఉంచుకున్నారని.. తనను ఏమీ చేయలేదని భర్తకు చెప్పింది. ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకుని ఇంటికొచ్చా అని భార్యప్వాపోయింది. అయితే ఈ విషయాలను భర్త నమ్మలేదు. దీంతో తమ (పర్ది) సంప్రదాయం ప్రకారం భార్య పాతివ్రత్యాన్ని పరీక్షించాలని నిర్ణయించాడు. ఈ మేరకు సలసల కాగే నూనెలో ఐదు రూపాయల బిళ్ల వేసి దాన్ని చేతితో తీయాలని పరీక్ష పెట్టాడు.

కాగె నూనెలో వేసిన నాణేన్ని చేతితో తీయడంతో భార్యకు చేతికి గాయాలయ్యాయి. ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆమె చెప్పేది తాను నమ్మనని.. ఆమె నిజం చెబుతుందో.. అబద్ధం చెబుతుందో తెలుసుకోవాలనుకుని అలా చేసినట్లు భర్త సమాధానం ఇస్తున్నాడు. తప్పు చేస్తే చేతులు, కాళ్లు కాలిపోతాయని ఆయన చెబుతున్నాడు. అతడి తీరుపై మహిళా సంఘాలతో సామాజికవేత్తలు, మేధావులు మండిపడుతున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర శాసనమండలి చైర్‌‌పర్సన్‌‌ నీలమ్‌ గోర్హె ఆగ్రహం వ్యక్తం చేసి అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు